మద్యనిషేధం డిమాండ్ చేస్తూ డీకే అరుణ దీక్ష 

రాష్ట్రంలో మద్య నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ గురువారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద రెండు రోజులపాటు జరిగే సంకల్ప దీక్ష ప్రారంభించారు.  రాష్ట్రంలో మద్యం అమ్మకాలను నియంత్రించి.. దశల వారీగా మద్యాన్ని పూర్తిగా నిషేధించాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన ఈ దీక్షను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ప్రారంభించారు. 

మద్యం వల్ల బాధితురాలైన వారి కుటుంబసభ్యులు సహా,  ఇటీవల ఆసిఫాబాద్‌ జిల్లాలో హత్యాచారానికి గురైన సమత భర్త, అత్త, పిల్లలు కూడా దీక్షలో పాల్గొన్నారు. ఈ దీక్షలో డాక్టర్‌ లక్ష్మణ్‌ మాట్లాడుతూ ట్విటర్ పిట్ట కేటీఆర్.. తండ్రి కొడుకుల వల్లే బ్రాండ్ హైదరాబాద్ కాస్తా బ్రాందీ హైదరాబాద్‌గా మారిందని ధ్వజమెత్తారు.  బీజేపీ బేటీ బచావో.. బేటీ పడావో అంటే… కేసీఆర్ మాత్రం బార్ బచావో బార్ బడావో అంటున్నారని దుయ్యబట్టారు. 

రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్.. ఇప్పుడు ఆదాయంకోసం  లిక్కర్ ను ఏరులైపారిస్తున్నారని ఆరోపించారు. మద్యం షాపులకు దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వం రూ. 980 కోట్ల ఆదాయం స్వీకరించిందని గుర్తు చేస్తూ  విచ్చలవిడిగా మద్యం అమ్మకాల ద్వారా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతున్నా.. మద్యం అమ్మకాలు పెంచుకుంటూపోతున్నారని మండిపడ్డారు. 

కేసీఆర్ తెలంగాణ ప్రజలను మద్యం మత్తులో ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి మద్యం అమ్మకాలకు ప్రోత్సహిస్తున్నారని విమరసంచారు. మద్యం నిషేధించాలని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని ప్రకటించారు. పల్లెల్లో బెల్ట్ షాపులను ద్వంసం చేయాలని మహిళా మోర్చా కార్యకర్తలకు పిలుపునిచ్చారు.