చీఫ్‌ మార్షల్‌ ప్రవర్తనపై చంద్రబాబు ఆగ్రహం 

ఏపీ అసెంబ్లీ గేటు దగ్గర చీఫ్‌ మార్షల్‌ దారుణంగా ప్రవర్తించారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల అనుచితంగా వ్యవహరించారని విమర్శించారు. ప్లేకార్డులు, బ్యానర్లు, నల్ల రిబ్బన్లు వద్దంటున్నారని.. చివరికి కాగితాలు కూడా తీసుకెళ్లనీయడం లేదని బాబు మండిపడ్డారు. 

టీడీపీ ఎమ్మెల్యేలపై చేయి వేసి తోసేశారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేను అవమానించినవారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ గతంలో ప్లకార్డులు తీసుకొచ్చి సభలో వైసీపీ ఎమ్మెల్యేలు యుద్ధవాతావరణం సృష్టించారని చంద్రబాబు గుర్తు చేశారు. అసెంబ్లీలో పులివెందుల పంచాయితీ చేస్తామంటే కుదరదని చంద్రబాబు స్పష్టం చేశారు. 

అంతకు ముందు, సమావేశాల్లో పాల్గొనడానికి చంద్రబాబు, టిడిపికి చెందిన ఎమ్మెల్యేలుగా వెళ్లగా అసెంబ్లీ సెక్యూరిటీ అడ్డుకుంది. ప్లేకార్డులతో లోపలికి వెళ్లొద్దని అసెంబ్లీ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంది. తమ ఆఫీసుకు తీసుకెళ్తామని టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పినా సెక్యూరిటీ వినలేదు. సెక్యూరిటీ సిబ్బంది తీరుకు నిరసనగా చంద్రబాబు, ఎమ్మెల్యేల అసెంబ్లీ ముందు బైఠాయించారు. 

అసెంబ్లీ వెలుపల మార్షల్స్ తీరుపై టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎదుట జరిగిన ఘటనలను సభలో వివరించిన అచ్చెన్న.. చంద్రబాబును కూడా మార్షల్స్ లాగేశారని మండిపడ్డారు. చీఫ్‌ మార్షల్‌కు ఎక్కడి నుంచి ధైర్యం వచ్చిందో తెలియదని... చంద్రబాబు, ఎమ్మెల్యేలపై మార్షల్స్‌ చేయి వేశారని ఆరోపించారు. ప్లేకార్డు, బ్యానర్‌, నల్ల బ్యాడ్జీలు వద్దని చెబితే తీసేశామని.. అసెంబ్లీలోకి కాగితాలు కూడా తీసుకెళ్లొద్దని ఆదేశిస్తున్నారని చెప్పుకొచ్చారు. 

చంద్రబాబు చేతిలో చిన్న తెల్లకాగితం ఉన్నందుకు 40 నిమిషాలు బయట నిలబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే పట్ల మార్షల్స్‌ దారుణంగా ప్రవర్తించారన్నారు. ప్రతిపక్ష నేత చేయి పట్టుకుని లాగేశారని తెలిపారు.

మధ్యలో కల్పించుకున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. అసెంబ్లీలోకి ప్లకార్డులు, బ్యానర్లు తీసుకురావద్దని.. టీడీపీ హయాంలోనే రూల్స్‌ తీసుకొచ్చారని తెలిపారు. మార్షల్స్‌నే టీడీపీ సభ్యులు తోసివేశారని ఆరోపించారు. టీడీపీ సభ్యుల తీరుపైనే మార్షల్స్‌ ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అసెంబ్లీ సజావుగా జరుగుతుంటే.. కావాలనే యాగీ చేస్తున్నారని విమర్శించారు.