అసెంబ్లీలో స్పీకర్, చంద్రబాబుల మధ్య మాటల యుద్ధం 

మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ తమ్మినేని సీతారాం, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుల మధ్య మాటల యుద్ధం చెలరేగడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. తెలుగు మీడియం స్కూళ్లపై చర్చ సందర్భంగా తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ టీడీపీ నేతలు పట్టుబట్టారు.

ఈ సందర్భంగా స్పందించిన స్పీకర్.. ఇదేమన్నా ఖవాలి డ్యాన్సా? ఒకరి తర్వాత మరొకరికి అవకాశం ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యానించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రతిపక్ష నేత చంద్రబాబు.. చైర్‌లో నుంచి లేచి మరీ స్పీకర్‌తో వాగ్వాదానికి దిగారు. మర్యాదగా ఉండాలంటూ స్పీకర్‌నుద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. బాబు వ్యాఖ్యలపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పట్ల అనుచితంగా మాట్లాడారంటూ ఫైర్ అయ్యారు. స్పీకర్ చైర్‌ను అవమానించారంటూ మండిపడ్డారు.

‘మీ మీద నాకు గౌరవం ఉంది. కానీ ఇష్టానుసారం స్పీకర్‌పై ఆరోపణలు చేస్తే మంచిది కాదు’ అని చంద్రబాబును స్పీకర్ హెచ్చరించారు. స్పీకర్‌ చైర్‌ను చంద్రబాబు ఏమాత్రం గౌరవించడం లేదని దయ్యబట్టారు. ఇంత సీనియారిటీ ఉండి ఏం లాభం అని ప్రశ్నించారు. తనపై చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు తక్షణమే వెనక్కి తీసుకోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. 

`స్పీకర్‌ స్థానానికి కూడా గౌరవం ఇచ్చుకోని పరిస్థితిలో మీరు ఉన్నారు. మీరు నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి లేదంటనే నేనే రికార్డుల నుంచి తొలగిస్తా’ అని సభాపతిన్నా సీతారాం స్పష్టం చేశారు. 

మరోవైపు చంద్రబాబు వ్యాఖ్యలపై అధికార పక్షం భగ్గుమంది. స్పీకర్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలను సభ్యులు తప్పుపట్టారు. చంద్రబాబును సభ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.