సాగు జలాలపై ఏపీ అసెంబ్లీలో మాటల మంటలు  

సాగునీటి జలాలపై ఏపీ అసెంబ్లీలో అధికార వైసీపీ, టీడీపీ మధ్య మాటల మంటలు రేగాయి. ప్రభుత్వ అవగాహనరాహిత్యంతో సాగునీటిని నిల్వ చేయలేకపోయారని, ఈ ఏడాది 798 టీఎంసీలు సముద్రంలో కలిశాయని టీడీఎల్పీ ఉపనేత రామానాయుడు తెలిపారు. తమ పాలనలో కుప్పం కంటే ముందే పులివెందులకు నీళ్లు ఇచ్చామని ఆయన గుర్తుచేశారు.

రామానాయుడు వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. శ్రీశైలం నుంచి కాల్వల సామర్ధ్యం మేరకు నీటిని తీసుకున్నామని, రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులన్నీ నింపామని ఆయన చెప్పారు. ఐదేళ్లలో ప్రాజెక్టుల పూర్తిపై చంద్రబాబు దృష్టి పెట్టలేదని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. 

వైఎస్‌ చేపట్టిన ప్రాజెక్టులను ప్రారంభించి.. నీళ్లు ఇచ్చానని చంద్రబాబు చెప్పారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయంటే వైఎస్సే కారణమని శ్రీకాంత్‌రెడ్డి కొనియాడారు. శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు స్పందిస్తూ 6 నెలల్లో రాయలసీమ ప్రాజెక్టుల్లో తట్టెడు మట్టి తీశారా అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. 

మిగులు జలాలు అవసరం లేదని ట్రిబ్యునల్‌కు నాడు వైఎస్‌ లేఖ ఇచ్చారని, అలాంటి వ్యక్తిని వాళ్లు పొగుడుతున్నారని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. కృష్ణా వరదల సమయంలో సీఎం జగన్‌ విదేశాలకు వెళ్లారని ఆయన గుర్తుచేశారు. వరదలు వస్తే ప్రాజెక్టులు నింపడంపై దృష్టి పెట్టకుండా.. ప్రతిపక్ష నేత ఇల్లు ఎలా ముంచాలనే ఆలోచించారని దుయ్యబట్టారు.