నిరుపేదలకు ఆరోగ్య భరోసా కల్పిస్తున్న ఆయుష్మాన్

ఆయుష్మాన్ భారత్ పథకం వల్ల దేశంలోని నిరుపేదలకు ఆరోగ్య భరోసా చేకూరుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశ్వాసం వ్యక్తం చేసారు. ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో అతి పెద్ద ఆరోగ్య సంరక్షణ పథకాన్ని అమలు చేస్తున్నట్లు జార్ఖండ్‌లోని రాంచీలో ఆయుష్మాన్ భారత్ - ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని ప్రారంభిస్తూ చెప్పారు. ధనికులకు మాత్రమె ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న వైద్య సేవలు ఇప్పుడు పేదలకు సహితం లభించనున్నాయని తెలిపారు.

ప్రపంచంలోని ఏ దేశమూ ఇటువంటి పథకాన్ని అమలు చేయడం లేదని పెర్కొనాటు  తన ప్రభుత్వం ఆరు నెలల్లోనే అత్యంత భారీ పథకాన్ని ప్రజల కోసం అమలు చేస్తోందని చెప్పారు. ఇంతటి ఘన విజయానికి కారణమైన తన బృందాన్ని అభినందించారు. ఈ బృందానికి దేశంలోని 50 కోట్ల మంది పేదల ఆశీర్వాదాలు ఉన్నాయని, ఇకపై ఈ బృందం మరింత పటిష్టంగా పని చేస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా 50 కోట్ల మంది ప్రజలకు రూ 5 లక్షల మేరకు ఆరోగ్య భీమ సమకూరుతుందని చెబుతూ మొత్తం ఐరోపా యూనియన్ జనాభాతో ఇది సమానమని గుర్తు చేసారు. ప్రముఖ అంతర్జాతీయ మెడికల్ జర్నల్ లాన్సుట్ సహితం ఈ కార్యక్రమాన్ని ప్రసంశించినదాని ప్రధాని పేర్కొన్నారు.

ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా తమ వద్ద ఉన్న మొత్తం డబ్బును ఖర్చు పెట్టవలసి వస్తూ ఉండడంతో పేద కుటుంభాలు చితికి పోతున్నాయని అంటూ అటువంటి వారికోసమే ఈ కార్యక్రమమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కులం, హోదా, మతం  ప్రసక్తి లేకుండా పేదలు అందరికి అందుబాటులోకి వస్తుందని ప్రధాని భరోసా ఇచ్చారు. పేదరికం అంటే ఏమిటో తనకు తెలుసని అంటూ పేదలు చాల స్వాభిమానం గలవారని, వారు డబ్బు కోసం ఎదుటివారి వద్ద చేయి చాచారని, వారికి ఇటువంటి సదుపాయం కల్పించడం వారి జీవితాలలో వెలుగు నింపుతుందని చెప్పుకొచ్చారు. 

ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభిస్తున్నప్పటికీ, ఈ పథకం వల్ల లబ్ధి పొందడం కోసం ఆసుపత్రికి వెళ్ళవలసిన అవసరం ఎవరికీ రాకూడదని తాను కోరుకుంటున్నట్లు ప్రధాని తెలిపారు. ఆసుపత్రులు ఖాళీగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. దురదృష్టవశాత్తూ ఎవరికైనా ఆరోగ్యం దెబ్బతింటే, ఈ పథకం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

దేశవ్యాప్తంగా 13,000 ఆస్పత్రులు ఈ కార్యక్రమంలో భాగస్వామలుగా చేరాయని ప్రధాని తెలిపారు. గరీబీ హఠావో అని నినదించిన నేతలు నిజానికి పేదల సంక్షేమానికి ఎలాంటి చర్యలూ చేపట్టలేదని కాంగ్రెస్‌ పార్టీని లక్ష్యంగా చేసుకుని  ప్రధాని విమర్శలు గుప్పించారు. గతంలోనే ఇటువంటి ఆలోచన చేసి ఉంటె ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉండేది చెప్పారు.

ఈ పథకాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం అమలు చేయడం లేదని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే తన ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని స్పష్టం చేసారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా ఇప్పటికే అమలు చేస్తున్నట్లు తెలిపారు.