మహారాష్ట్ర కూటమిలో పౌరసత్వ బిల్ చిచ్చు!

మహారాష్ట్రలో శివసేన,నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి), కాంగ్రెస్ పార్టీలు కలిసి ‘మహా వికాస్ అఘాడి’  సంకీర్ణ కూటమిగా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేసి పది రోజులు గడవక ముందే పార్లమెంట్ లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పౌరసత్వ సవరణ బిల్ చిచ్చు రేపుతున్నది. 

ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ జారగనే లేదు. ముఖ్యమంత్రి ఉద్ధవ్  థాకరేతో ప్రమాణస్వీకారం చేసిన ఆరుగురు మంత్రులకు శాఖలు కూడా కేటాయించలేదు. మంత్రివర్గ విస్తరణకు భాగస్వామ్య పక్షాల మధ్య కీలక శాఖల కేటాయింపుపై రగడ నడుస్తున్నట్లు కధనాలు వెలువడుతున్నాయి. 

ఇటువంటి సమయంలో లోక్‌సభలో హోమ్ మంత్రి అమిత్ షా  పౌరసత్వ సవరణ బిల్లును ప్రవేశపెట్టడం ఈ పార్టీల మధ్య పొసగటం లేదని వెల్లడైనది. ఈ బిల్లును కాంగ్రెస్, ఎన్సీపీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, వ్యతిరేకంగా ఓట్ వేయగా, శివసేన ఎంపీలు మాత్రం బిల్లుకు సమర్ధిస్తూ ఓట్ వేశారు. 

బిల్లుపై చర్చ సందర్భంగా దానిలోని పలు అంశాలపై తమకు అభ్యంతరాలు ఉన్నట్లు శివసేన సభ్యులు ప్రసంగాలు చేసినా చివరకు ఓటింగ్ సమయంలో మొత్తం 17 మంది బిల్లుకు మద్దతుగా ఓట్ వేయడం మిత్ర పక్షాలకు దిగ్బ్రాంతి కలిగించింది. 

దానితో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన అసహనాన్ని బహిరంగంగానే వ్యక్తం చేశారు. ఈ బిల్లును భార‌త రాజ్యాంగంపై దాడి అని ఆయ‌న విమ‌ర్శించారు. ఇవాళ ట్విట్ట‌ర్‌లో రాహుల్ స్పందిస్తూ పేరు చెప్పకుండానే శివసేనపై నిప్పులు చెరిగారు.  ఆ బిల్లుకు మ‌ద్ద‌తు ఇచ్చేవాళ్లు.. మ‌న దేశ వ్య‌వ‌స్థీకృత విధానంపై దాడి చేస్తున్న‌ట్లే అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దేశ ప్రయోజనాల కోసం ఈ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇచ్చిందని శివసేన ఎంపీ అరవింద్‌ సావంత్‌ తెలిపారు. దీంతోపాటు మూడు పార్టీలు కలసి ఏర్పాటు చేసుకున్న  ‘కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ)’ అనేది కేవలం మహారాష్ట్ర రాజకీయాల వరకే వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.