ఉపపోరులో జేడీఎ్‌సకు కోలుకోలేని  ఎదురుదెబ్బ  

కర్ణాటక ఉపపోరులో జేడీఎ్‌సకు కోలుకోలేని విధంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ప్రాతినిథ్యం వహించిన మూడు సిట్టింగ్‌ స్థానాలు హుష్‌కాకి అయ్యాయి. వీటిలో రెండింటిని బీజేపీ కైవశం చేసుకోగా మరోచోట కాంగ్రెస్‌ విజయఢంకా మోగించింది. ఈ ఉపపోరులో పోటీ చేసిన 12 నియోజకవర్గాలలోనూ ఓటమిని మూటగట్టుకుంది. 

కుమారస్వామి నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత జేడీఎ్‌సకు ఎదురైన ఈ ఓటమి రాజకీయంగా ఎదురుదెబ్బేనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 

‘ఆపరేషన్‌ కమల’ వలలో పడి జేడీఎ్‌సకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు హెచ్‌.విశ్వనాథ్‌ (హుణసూరు), నారాయణగౌడ (కె.ఆర్‌.పేట), గోపాలయ్య (మహాలక్ష్మీ లే అవుట్‌)లు తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేయడం ఆపై బీజేపీ శిబిరంలో ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. అప్పటి స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ అప్పట్లో వీరిపై అనర్హత వేటు వేశారు.

ఇలా అనర్హత వేటుపడ్డ ఈ ముగ్గురిలో బీజేపీ టికెట్‌పై గోపాలయ్య, నారాయణగౌడలు మాత్రమే తిరిగి భారీ మెజారిటీతో శాసనసభకు ఎన్నిక కావడం గమనార్హం. జేడీఎస్‌ అధ్యక్షుడిగా సేవలందించిన హుణసూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే విశ్వనాథ్‌ ఘోరపరాజయాన్ని మూటగట్టుకోక తప్పలేదు. 

ఈ ఫలితాలు దళపతులకు ఏమాత్రం మింగుడు పడడం లేదు. ప్రత్యేకించి జేడీఎస్‌ కంచుకోటగా ఉన్న కె.ఆర్‌.పేటలో బీజేపీ టికెట్‌పై నారాయణగౌడ గెలుపొందడాన్ని వీరు జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్‌, జేడీఎ్‌సల మధ్య ఓట్లు గణనీయంగా చీలిపోవడం వల్లే ఫలితం ఇలా వచ్చిందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. 

మాజీ సీఎం కుమారస్వామి తాజా ఫలితాల నేపథ్యంలో కొంతకాలం పార్టీ వ్యవహారాలకు పూర్తిగా దూరంగా ఉండాలని తలపోస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన జేడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు దేవేగౌడ వద్ద వ్యక్తం చేసినట్టు సమాచారం. 

కాగా ఉపఫలితాలతో మాజీ ప్రధాని దేవేగౌడ తీవ్రంగా కలత చెందుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం శాసనసభలో ఆ పార్టీకి 34మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉపఫలితాల అనంతరం వీరిలో మరికొంతమంది బీజేపీలోకి చేరేందుకు ఉవ్విళ్ళూరుతున్నట్టు వెలువడుతున్న కథనాలు దేవేగౌడ కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి.