ఆనం వాఖ్యలపై జగన్ ఆగ్రహం..వైసిపిలో కలకలం  

తమ పరిపాలన పట్ల సొంత పార్టీ వారే విమర్శలు చేస్తుండటం, అసాంఘిక శక్తులు రాజ్యమేలుతున్నట్లు ప్రకటనలు చేస్తుండటం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 తాజాగా, నెల్లూరు పట్టణ అసెంబ్లీ నియోజకవర్గంలో రౌడీలూ గుండాలూ ఎక్కువయ్యారు... ప్రజలు మనోవేదనకు గురవుతున్నారు... భూకబ్జాలూ... సెటిల్‌మెంట్లూ పెరిగిపోయాయంటూ వైసీపీ వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలపై  జగన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తక్షణమే ఆనం నుంచి సంజాయిషీని కోరుతూ షోకాజ్‌ నోటీసును జారీ చేయాలని పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డిని ఆదేశించారని సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. బీద మస్తానరావు పార్టీలో చేరుతున్న సందర్భంలో వెంకటగిరి ఎమ్మెల్యే వ్యాఖ్యలు ప్రస్తావనకు వచ్చాయి. దీంతో ఆనం వ్యాఖ్యలపై సీఎం జగన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఆర్ధిక మంత్రిగా ఉన్న నెల్లూరు నగర ఎమ్మెల్యేపై బాహాటంగా ఆనం ఇలా వ్యాఖ్యానించడం ఏమిటని జగన్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే తనతో సహా ఎవరైనా ఒకటేనని, క్రమశిక్షణా చర్యలు తప్పవని జగన్‌ హెచ్చరించినట్లు కథనం. ఆ సమయంలో అక్కడ నెల్లూరు జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, మంత్రి అనిల్‌ కుమార్‌, రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి, వైసీపీ నేత రూప్‌కుమార్‌ తదితరులు ఉన్నారు. 

ఆ సమయంలో పార్టీ అధ్యక్షుడు.. సీనియర్‌ నేత ఆనంపై కఠిన వైఖరితో ఉండాలని తేల్చి చెప్పడం చర్చనీయాంశమైంది. వ్యక్తిగత ఆధిపత్యం ప్రదర్శిస్తానంటే సహించబోనని ఈ సందర్భంగా జగన్‌ స్పష్టం చేయడంతో.. పార్టీలో ఆనంతో సహా ఇతర నేతలకూ జగన్‌ హెచ్చరికలు జారీ చేసినట్లయిందని పలువురు వ్యాఖ్యానించారు. 

శాసనసభ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రతిపక్షానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలను వైసీపీలోకి లాక్కొనే ప్రయత్నం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి బహిరంగంగా మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు పార్టీ అధినేతను ఇరుకున పెట్టాయని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. 

ఇటీవల చిత్తూరు పర్యటనకు వెళ్లిన చంద్రబాబుతో రేణిగుంట విమానాశ్రయంలో ఆనం భేటీ అయ్యారన్న ప్రచారమూ వైసీసీ వర్గాల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో బాహాటంగా ఆనం వ్యాఖ్యలు కలకలాన్ని రేపాయి.