అక్రమ మైనింగ్ ఉచ్చులో కుమారస్వామి !

కాంగ్రెస్ శాసన సభ్యుల బెదిరింపు రాజకీయాలు, వారిని ఆకట్టుకొనేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నాల నుండి తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం అష్ట కష్టాలు పడుతున్న కర్ణాకట ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామిని ఇప్పుడు జంతకల్‌ కేసు వెంటాడుతోంది. జంతకల్‌ మైనింగ్‌కు అక్రమంగా అనుమతులు ఇచ్చారనే విషయమై సుప్రీంకోర్టు అక్టోబరు 11లోగా చార్జ్‌షీట్‌దాఖలు చేయాలని సూచించింది. నిబంధనలకు గాలికి వదిలి జంతకల్‌ మైనింగ్‌ కంపెనీకి అనుమతులు ఇచ్చారనే ఆరోపణలపై కుమారస్వామితోపాటు 12మందిపై సిట్‌ చార్జ్‌షీట్‌ సిద్ధం చేసింది.

సుప్రీంకోర్టు ఆదేశాలతో అక్టోబరు మొదటివారంలో చార్జ్‌షీట్‌ తప్పనిసరిగా దాఖలు చేసే అవకాశం ఉంది. 2011లో సమాచార హక్కుచట్టం కింద అబ్రహాం అనే వ్యక్తి 14,200 మెట్రిక్‌ టన్నుల ముడిఖనిజాన్ని ఎగుమతి చేసేలా జంతకల్‌ మైనింగ్‌ కంపెనీకి అనుమతులు ఇచ్చారని లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అప్పటి లోకాయుక్త జస్టిస్‌ సంతోష్ హెగ్డే 1700 పేజీలతో నివేదికను సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.31.02 కోట్లు నష్టం వాటిల్లిందని ప్రస్తావించారు.

ఇదే నివేదిక ఆధారంగా అబ్రహాం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సిట్‌కు చార్జ్‌షీట్‌ దాఖలు చేయాలని సూచించారు. జంతకల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ యజమాని వినోద్‌గోయెల్‌కు అప్పటి గనులశాఖ డైరెక్టర్‌ గంగారం బడేరియా ఉత్తర్వులు ఇవ్వగా అప్పట్లో సీఎం కుమారస్వామి ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ అయినట్లు సుప్రీం పిటీషన్‌లో పేర్కొన్నారు.

2007లో గంగారాం కుమారుడు గగన్‌ బడేరియా బ్యాంకు ఖాతాకు వినోద్‌గోయెల్‌ ఖాతా నుంచి రూ.పది లక్షలు జమ అయిన ఆధారాలను సిట్‌ సేకరించి విచారణలు కూడా జరిపిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశించడంతో ప్రస్తుతం సిట్‌ తప్పనిసరిగా చార్జ్‌షీట్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది.