సర్వేలన్నీ కమలం వైపే.. గెలుపుపై సీఎం ధీమా  

అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించిన కర్ణాటకలో  ఉపసమరం ఎట్టకేలకు ముగిసింది. ఇప్పుడు అందరి చూపు 9వ తేదీ నాటి ఓట్ల లెక్కింపు పైనే ఉంది. అయితే పలు చానళ్లతో పాటు ప్రైవేట్‌ సంస్థలు నిర్వహించిన సర్వేలో విజయావకాశాలు బీజేపీకే మెండుగా ఉన్నాయని ప్రకటించడంతో ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం నెలకొంది. 

ఓటర్లు తమ అభివృద్ధికే పట్టం కట్టారని, మరో మూడేళ్లు నిరంతరాయంగా పాలిస్తామని బిజెపి నేతలు ప్రకటిస్తున్నారు. జేడీఎస్‌, కాంగ్రెస్‌లను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని తమ గెలుపునకు ఢోకా లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ముందస్తు సర్వేలతో ఒరిగేదేమీ లేదని ఫలితాలు తమకే అనుకూలంగా ఉంటాయని మాజీ సీఎం సిద్ధరామయ్య పేర్కొంటున్నారు. ఫలితాల తర్వాత వాస్తవాలు బయట పడ్తాయని వెల్లడిస్తున్నారు. 

ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాలకు దిశానిర్దేశం చేయడమే కాకుండా ఏకంగా ప్రభుత్వ మనుగడ కూడా ఆధారపడివుంది. గురువారం పోలింగ్‌ ముగిసిన కాసేపటికే సీఓటర్‌ సర్వే ఫలితాలు వెల్లడికాగా ఆ తర్వాత మరో మూడు కన్నడ ఛానళ్ళు సర్వేలను ప్రకటించాయి. 

దాదాపు అన్ని సర్వేలలోనూ బీజేపీకే ముందంజ చూపడంపై ఆ పార్టీలో ఉత్సాహం పెరిగింది. బీజేపీకి ఎనిమిది స్థానాలు దక్కితే ప్రభుత్వానికి డోకా ఉండదు. అలా కానిపక్షంలో అధికారమే పరమావధిగా భావిస్తే మరోసారి కాంగ్రెస్‌, జేడీఎస్‌లు ఒక్కటైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 

సమీక్షలో సిఓటర్‌ బీజేపికి 9 నుంచి 12 స్థానాలు, కాంగ్రెస్‌కు 3 నుంచి 6, జేడీఎస్‌కు ఒక స్థానం దక్కుతుందని ప్రకటించగా సువర్ణ ఛానల్‌ బీజేపీకి ఏకంగా 10 నుంచి 12, కాంగ్రెస్‌కు 2 నుంచి 4, జేడీఎస్‌కు 1 - 2 స్థానాలు దక్కవచ్చునని తేల్చింది. ఇక పబ్లిక్‌ టీవీ బీజేపీకి 8 నుంచి 10, కాంగ్రెస్‌కు 3 నుంచి 5, డీఎస్‌కు 1 నుంచి 2, ఇండిపెండెంట్‌లకు ఒక స్థానం దక్కవచ్చునని ప్రకటించగా దిగ్విజయ ఛానల్‌ బీజేపీకి 9 నుంచి 11, కాంగ్రెస్‌కు 2 నుంచి 4, జేడీఎస్‌కు 2, ఇండిపెండెంట్‌కు ఒక స్థానం దక్కవచ్చునని ప్రకటించింది. 

ఇప్పటివరకు నాలుగు సర్వేలు బహిరంగం కాగా రెండింట హొసకోట ఇండిపెండెంట్‌ అభ్యర్థి శరత్‌ బచ్చేగౌడ గెలుపు సాధ్యమనే సంకేతం ఇచ్చింది. అన్ని సర్వేలు బీజేపీకే అవసరమైనదానికంటే ఒకటి రెండు అత్యధికంగా చూపడం ఆ పార్టీ నేతల్లో సర్కార్‌కు డోకా ఉండదనే విశ్వాసంలో ఉన్నారు. సీఎం యడియూరప్ప గురువారం రాత్రి పొద్దుపోయేదాకా ఇంటలిజెన్స్‌తో పాటు పార్టీ వర్గాలతో సమీక్షలు జరుపగా శుక్రవారం మరోసారి పార్టీ ముఖ్యులతో భేటీ అయ్యారు. 

అయితే కాంగ్రెస్‌ ముఖ్యనేత, ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య సర్వేలను కొట్టిపారేశారు. గురువారం ప్రకటించిన సర్వే ఎప్పుడూ వాస్తవానికి దగ్గరగా లేదన్నారు. మరో మూడురోజుల్లో ఫలితాలు వస్తాయని అప్పుడు వాస్తవలు తేలుతాయని అంతలోగానే సర్వేల పేరుతో బీజేపీ ఉత్సాహంగా గడుపుకోవచ్చునన్నారు.