ఎన్నారైలకు వోట్ హక్కు కల్పిస్తున్న మోడీ

ఇప్పటి వరకు భారత దేశ అభివృద్దిలో భాగస్వములవుతున్న ప్రవాస భారతీయులు ఇకనుండి భారత ఎన్నికల పక్రియలో కూడా భాగస్వాములు కానున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న చోరువ కారణంగా వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో వారికి వోట్ హక్కు లభించనున్నది. వారు నేరుగా వోట్ వేయలేక పోయినా, తమ వారి ద్వారా ఇక్కడ ప్రోక్సీ వోట్ వేసే సౌలభ్యం ప్రభుత్వం కల్పిస్తున్నది.

గత గురువారం లోక్ సభ లో ఆమోదించిన  ప్రజాప్రాతినిధ్య చట్టం (సవరణ) బిల్లు,   2017తో ప్రవాస భారతీయులకు వోట్ లభించే అవకాశం ఏర్పడింది. ఇటువంటి హక్కు కోసం వారు చాలాకాలంగా కోరుతున్నా చివరకు ఇప్పటికి ప్రధాన మంత్రి మోడీ కార్యరూపంలోకి తీసుకు రాగలిగారు.

ఈ బిల్లు  ప్రకారం ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్న ఎన్నారైల తరఫు ప్రతినిధులు (ప్రాక్సీ ఓటు) ఓటేసేందుకు చట్టపరంగా అనుమతి లభిస్తుంది. ఎన్నారై తన నివాస ప్రాంత పరిధిలోని లోక్‌సభ/ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఓటేసేందుకు ఒక వ్యక్తిని నామినేట్ చేస్తారు. దీని ప్రకారం విదేశాల్లో నివసిస్తున్న భారతీయులంతా స్వేచ్ఛగా తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకునేందుకు వెసులుబాటు కలుగుతుంది. ఇప్పటివరకు సైనిక జవాన్లు మాత్రమే ప్రాక్సీ ఓటు వేసేందుకు అనుమతి ఉంది.

ఈ చట్టం ఎన్నారైలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు సహకరిస్తుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. దానితో దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ప్రవాస భారతీయులు రాజకీయ పార్టీలు విజయావకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఏర్పడింది. 543 నియోజకవర్గాల పరిధిలో 1.1 కోట్ల మంది, అంటే ఒక్కో నియోజకవర్గంలో సగటున 21 వేల మంది ఎన్నారై ఓటర్లు ఉంటారని అంచనా వేస్తున్నారు. ఎన్నారైలకు లభించిన ఓటుహక్కుతో ప్రతి ఎన్నికలోనూ అభ్యర్థుల గెలుపొటములు తారుమారయ్యే అవకాశం ఉండగలదని భావిస్తున్నారు.

ప్రధాని మోదీ 2014 నవంబర్ నుంచి పర్యటించిన వివిధ దేశాల్లో సుమారు కోటి మంది ఎన్నారైలు ఉన్నారు. మోదీ విదేశీ పర్యటనల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో వేల సంఖ్యలో ప్రవాస భారతీయులను కలుసుకొని, వారు పాల్గొన్న సభలలో ప్రసంగించారు. వారిలో జాతీయవాదం ప్రతిధ్వనించే ప్రయత్నం చేయడం గమనార్హం.