హవాలా కేసులో కాంగ్రెస్‌కు ఐటీ నోటీస్‌

రూ.3,000 కోట్ల హవాలా రాకెట్‌కు సంబంధించి ఆదాయ పన్ను(ఐటీ) శాఖ కాంగ్రెస్‌ పార్టీకి నోటీసులిచ్చింది. ఓ కార్పొరేట్‌ సంస్థ నుంచి అందుకున్న రూ.170 కోట్ల విరాళంపై వివరణ ఇవ్వాల్సిందిగా ప్రతిపక్ష పార్టీని ఐటీ శాఖ కోరింది. 

రూ.3 వేల కోట్ల హవాలా రాకెట్‌కు సంబంధించి గత నెలలో దేశవ్యాప్తంగా జరిపిన సోదాల్లో ఈ విరాళం వ్యవహారం బయటపడిందని వివరించింది. ఈ కేసులో తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీకి, కొందరు కాంగ్రెస్‌ నేతలకు ఉన్న బంధంపై దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌కు నోటీసు లిచ్చామంది. 

మౌలిక రంగ కార్పొరేట్‌ సంస్థలకు హవాలా రాకెట్‌తో ఉన్న లింకులపై ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, పుణే, ఆగ్రా, గోవాల్లోని 42 చోట్ల దాడులు జరపగా తప్పుడు బిల్లులు, బోగస్‌ కాంట్రాక్టులు, అక్రమ లావాదేవీలు భారీగా బయటపడ్డాయి.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ప్రముఖుడికి రూ.150 కోట్లకు పైగా నగదు ముట్టినట్లు ఆధారాలు దొరికాయి. రూ.4.19 కోట్ల లెక్క చూపని నగదుతోపాటు రూ.3.2 కోట్ల విలువైన నగలు స్వాధీనం చేసుకున్నాం’అని ఐటీ శాఖ వెల్లడించింది. హవాలా మార్గంలో భారీగా నిధుల మళ్లించిన సంస్థలు ఢిల్లీ, ముంబైల్లో ఎక్కువగా ఉన్నాయి.