బీజేపీకి దూరంగా లేను.. కలిసే ఉన్నా  

బీజేపీకి తాను దూరంగా లేనని.. కలిసే ఉన్నానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సంచలన వాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా విషయంలోనే బిజెపితో సిద్ధాంతపరంగా విభేదించినట్లు తెలిపారు. దేశానికి అమిత్ షా లాంటి వ్యక్తులే కరెక్ట్ అని వ్యాఖ్యలు చేసి 24 గంటలు కూడా గడవక ముందే ఈ ప్రకటన చేయడం రాజకీయ వర్గాలలో కలకలం రేపుతున్నది. 

తాను విడిగా పోటీ చేయడం వల్లననే వైసీపీ ప్రభుత్వం ఏర్పడినదని చెబుతూ వైసీపీ వాళ్లు తనకు రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలని చెప్పారు.  ఎందుకంటే.. ‘నేను బీజేపీ, టీడీపీతో కలిసి మళ్లీ పోటీ చేసి ఉంటే వైసీపీ ఎక్కడ ఉండేది?, అసలు వైసీపీ అధికారంలోకి వచ్చేదా?,' అని ప్రశ్నించారు. 

చంద్రబాబు, బిజెపి, తాను కలసి పోటీచేస్తే ఇప్పుడు మాట్లాడే నాయకులు ఎక్కడ ఉండే వాళ్ళో ఊహించుకోవాలని హితవు పలికారు. టీడీపీతో అంత గొడవ పెట్టుకున్నాక కలసి ఎలా పోటీచేస్తాం. ఎంత మంది వైసీపీ నాయకులు తనకు కబురు పంపారో తనకే తెలుసన్నారు. ఆ పేర్లు సరికాదనే బయట పెట్టడం లేదని తెలిపారు  

‘వైసీపీకి అమిత్ షా అంటే భయం.. కానీ నాకు షా అంటే గౌరవం.. అందుకే వైసీపీ వాళ్లకు విమర్శలు చేయడం తప్ప.. ఇంకేం తెలియదని విమర్శించారు. గత ప్రభుత్వ వైఫల్యాలను విమర్శించడంతోనే ప్రభుత్వం సమయం వృధా చేస్తోందని విమర్శించారు. 

మాజీ సీఎం ఇల్లు కూల్చివేతపై ఉన్న శ్రద్ధ సమస్యలపై లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి సామాన్యుడి కష్టాలు పట్టవా?, రైతులకు గోడౌన్లు కట్టాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని ధ్వజమెత్తారు. కియా పరిశ్రమ సీఈవోను వైసీపీ నేతలు బెదిరించారు.. ఇక రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా వస్తాయి? అని ప్రశ్నించారు. 

75 శాతం స్థానికులకే ఉద్యోగాలు అంటే పరిశ్రమలు వస్తాయా? అని నిలదీశారు. ఇంగ్లీష్‌ మీడియం అవసరమే.. కానీ తెలుగుమీడియం లేకుండా చేస్తే ఎలా?, ఉర్దూ మీడియం కూడా తీసేసి ఇంగ్లీష్‌ మీడియాన్ని ప్రోత్సహిస్తారా?, అని నిలదీశారు. 

తెలుగును పరిపాలన భాషగా వాడాలని సూచించారు. తెలుగు భాషను పరిరక్షించమంటే వైసీపీ వక్రీకరిస్తోందని మండిపడ్డారు. కనీసం రూ.25కి కిలో ఉల్లిపాయలు ఇవ్వలేకపోతున్నారని ఆరోపించారు. కిలో ఉల్లిపాయల కోసం 7 గంటలు క్యూలో ఉండాలా?, 151 మంది ఎమ్మెల్యేలు ఉండి ఉల్లి ధరలు తగ్గించలేకపోయారని మండిపడ్డారు. 

ప్రజలకు మాణిక్యాలు అవసరం లేదు, నిత్యావసరాలు ఇస్తే చాలని హితవు పలికారు. రాయలసీమ యువత మార్పు కోరుకుంటుందని తెలిపారు.