రాఫేల్ పై హోలాండే ప్రకటనతో రాజకీయ దుమారం

రాఫెల్ విమానాల ఒప్పందానికి సంబంధించి ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే చేసిన ప్రకటన దేశంలో పెద్ద రాజకీయ దుమారాన్ని రేపింది. భారీ కుంభకోణం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో భారత్, ఫ్రాన్స్ ప్రభుత్వాలు వివరణ ఇస్తూ, యుద్ధ విమానాలను తయారు చేసే డస్సాల్ట్ సంస్థ తన భారత భాగస్వామిగా రిలయన్స్‌ను ఎంపిక చేసుకోవడంలో తమ ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశాయి. రిలయన్స్ సంస్థను ఎంపిక చేసుకోవాలన్న నిర్ణయం తమదేనని డస్సాల్ట్ సంస్థ తెలిపింది.

కాగా డస్సాల్ట్ ఏవియేషన్‌కు భాగస్వామిగా రిలయన్స్‌ను ఎంపిక చేసింది భారత ప్రభుత్వమేనని తాను చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని హోలాండే పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో ప్రధానిపై విరుచుకుపడిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆయన ఈ దేశానికి చౌకీదార్ కాదు దొంగ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రధాని మోదీ నిజాయితీకి ప్రతీక అని స్పష్టం చేసారు. ఓ పార్టీ అధ్యక్షుడు ప్రధానిని విమర్శించడం బాధ్యతారాహిత్యం, సిగ్గుచేటు అని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ వంశమంతా దొంగలేనని రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ ఎదురుదాడికి దిగారు.

భారత భాగస్వాములను ఎంపిక చేసుకొనే స్వేచ్ఛ ఫ్రెంచ్ కంపెనీలకుందని, ఈ నేపథ్యంలోనే రాఫెల్ యుద్ధవిమానాలను తయారు చేస్తున్న డస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ రిలయన్స్‌ను ఎంపిక చేసుకుందని ఫ్రాన్స్ తెలిపింది. రిలయెన్స్ డిఫెన్స్ సంస్థ పేరును భారత ప్రభుత్వమే ప్రతిపాదించిందన్న ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే వ్యాఖ్యల నేపథ్యంలో ఫ్రెంచ్ సర్కార్ ఈ వివరణ ఇచ్చింది. ఫ్రెంచ్ కంపెనీలు భారత్ నుంచి పారిశ్రామిక భాగస్వాములను ఎంపిక చేసుకోవడంలో మేము ఏ విధంగాను జోక్యం చేసుకోలేదు అని ఫ్రాన్స్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

ఒప్పందం ప్రకారం, ఫ్రెంచ్ కంపెనీలు తమ భారత భాగస్వామిని ఎంపిక చేసుకొనే స్వేచ్ఛను కలిగి ఉన్నాయి. ఎంపిక చేసుకున్న కంపెనీలతో చేపట్టనున్న ఆఫ్‌సెట్ ప్రాజెక్టులకు సంబంధించి భారత ప్రభుత్వం అనుమతి తీసుకుంటాయి. ఈ ప్రక్రియ అంతా ఒప్పందంలోని నిబంధనల ప్రకారం జరుగుతుంది అని ఫ్రెంచ్ ప్రతినిధి ఆ ప్రకటనలో వివరించారు.

మరోవంక డస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ రిలయన్స్ డిఫెన్స్‌ను భాగస్వామిగా ఎంచుకోవడంలో తమ పాత్ర ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వార్తా కథనాల ఆధారంగా అనవసర వివాదాలకు తెరలేపుతున్నారని పేర్కొంది. రిలయన్స్ సంస్థను ఆఫ్‌సెట్ భాగస్వామిగా ఎంపికచేయడంలో మా పాత్ర లేదని ఇంతకుముందు చెప్పాము, మళ్లీ పునరుద్ఘాటిస్తున్నాము అని రక్షణమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. డస్సాల్ట్, రిలయన్స్‌ల మధ్య జరిగింది కేవలం వాణిజ్య ఒప్పందమేనని స్పష్టం చేసింది.

2015, ఏప్రిల్ 10న నాటి ఫ్రెంచ్ అధ్యక్షుడు హోలాండేతో సమావేశం అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక ప్రకటన చేస్తూ ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఒప్పందంలోని ఒక నిబంధన ప్రకారం, రాఫెల్ విమానాలను తయారు చేస్తున్న డస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ ఒక భారత భాగస్వామిని ఎంపిక చేసుకొని 50 శాతం (రూ.30వేల కోట్ల విలువైన) కాంట్రాక్టును ఇవ్వాలి.

మోదీ సర్కార్ చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఒప్పందంలో ఈ నిబంధనను చేర్చారు. దాని ప్రకారమే తాము రిలయన్స్ సంస్థను ఎంపికచేశామని డస్సాల్ట్ తెలిపింది. రక్షణ కొనుగోలు ప్రక్రియ (డీపీపీ), 2016 ప్రకారమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. రిలయన్స్‌ను ఎంపిక చేసుకోవడం కేవలం తమ నిర్ణయమేనని, ఇందులో ఎవరి ప్రమేయమూ లేదని స్పష్టం చేసింది.

ప్రధాని మోదీని విపక్షనేత రాహుల్‌గాంధీ దొంగ అని అభివర్ణించిన నేపథ్యంలో కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు ఆ వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. రాఫెల్ ఒప్పందంపై ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండే చేసిన ప్రకటనను కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ తిరస్కరించారు. ఏ ఒత్తిడికి లొంగిపోయి ఆయన ఆ ప్రకటన చేశారో తెలియడం లేదని చెప్పారు. డస్సాల్ట్ ఏవియేషన్, రిలయన్స్‌ల మధ్య ఒప్పందం 2012లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే జరిగిందని పేర్కొన్నారు.

అహంకారి, సమాచార లోపం ఉన్న నాయకుడు, అదేపనిగా అబద్ధాలు చెప్తున్నాడు అంటూ రాహుల్ పై మండిపడ్డారు. రాఫెల్ ఒప్పందం వివరాలను బయటపెట్టాలని కోరడం ద్వారా రాహుల్‌గాంధీ పాకిస్థాన్‌కు సహాయపడుతున్నారని ఆరోపించారు.