కేసీఆర్ ఇంటిలోని వికెట్లనే పడగొట్టడానికి సిద్ధం

తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ ఇంటిలోని వికెట్లనే పడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారని బిజెపి నేత జి కిషన్ రెడ్డి స్పష్టం చేసారు. వచ్చే ఎన్నికలలో తమ పార్టీ సెంచరీ కొండుతుందని అంటూ వందకు పైగా సీట్లను గెలుస్తామని కేటిఅర్ పేర్కొనడాన్ని ఎద్దేవా చేసారు. `మా బౌలింగ్‌తో మీ వికెట్లు ఎన్ని పడిపోతాయో చూసుకో’ అని సవాల్ చేసారు. కేసీఆర్, కేటీఆర్ సీట్లకు కూడా ఎసరు పెడతామని ఆయన స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కోవడానికి బిజెపి సిద్దంగా ఉన్నదని చెబుతూ ఈ నెల 27న చేగుంటలో నిర్వహించే మహిళా సంఘాల సమావేశానికి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ , వచ్చే నెల మొదటివారంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కరీంనగర్‌లో పర్యటిస్తారని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని వెల్లడించారు. ఎన్నికల ప్రచారం కోసం జాతీయ నాయకుల షెడ్యూల్ కూడా రూపొందిస్తున్నామని ప్రకటించారు.

అభ్యర్థుల ఎంపిక, పొత్తుల అంశం, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, టీ హరీశ్‌రావు బీజేపీలో చేరుతారంటూ జరుగుతున్న ప్రచారాన్ని విలేకరులు ప్రస్తావించగా అభ్యర్థుల ఎంపికపై వచ్చే నెల నుంచి కసరత్తు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. పార్టీ ముఖ్యనేతలు కోర్‌కమిటీకి అభ్యర్థులకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తారని చెప్పారు. పార్టీలో చేరడానికి అనేకమంది ఆసక్తి చూపిస్తున్నారని చెబుతూ అభ్యర్థులు వస్తే చేర్చుకుంటామని, ఆ తరువాతే వారికి టికెట్ల అంశంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

మెనిఫెస్టో రూపకల్పనపై కసరత్తు చేస్తున్నామని కిషన్ రెడ్డి చెప్పారు. ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేయాలనే నిర్ణయానికి వచ్చామని చెబుతూ భవిష్యత్‌లో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేమన్నారు.  బీజేపీ ద్వారా సుపరిపాలన అందుతుందని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ పొత్తును ప్రస్తావిస్తూ అడ్రస్ లేని పార్టీలతో పొత్తా అని అవహేళన చేశారు. తెలంగాణకు అవసరం లేని టీడీపీతో అపవిత్ర పొత్తు కుదుర్చుకుంటున్నారని కాంగ్రెస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పొత్తు కుదుర్చుకునేప్పుడు ఆది నుంచి కాంగ్రెస్, టీడీపీ నేతలు చేసుకున్న పరస్పర విమర్శలను ఒకసారి రెండు పార్టీల నేతలు గుర్తు చేసుకుంటే బాగుంటుందని హితవు చెప్పారు.

సీట్ల విషయంలో కాంగ్రెస్‌లోనే ఏకాభిప్రాయం లేదని అంటూ అలాంటప్పుడు ఇతర పార్టీలతో ఉమ్మడి మెనిఫెస్టో ఎలా రూపొందిస్తారని ప్రశ్నించారు. ఈ పార్టీల అపవిత్రపొత్తును తాము ఎండగడుతామని స్పష్టం చేసారు.  రాఫెల్‌పై ఒప్పందాలపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఆయన మండిపడ్డారు. అవినీతికి చిరునామాగా ఉన్న కాంగ్రెస్‌కు బీజేపీ గురించి, మోడీ గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదని దయ్యబట్టారు. ఎవరు అవినీతిపరులో ప్రజలకు బాగా తెలుసన్నారు.

తెలంగాణ ఇచ్చామంటూ కాంగ్రెస్ చెప్పుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. మీరా తెలంగాణ ఇచ్చింది.? తెచ్చింది అని మండిపడ్డారు. కాంగ్రెస్ వైఖరి కారణంగా 1200 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేసారు. మా ఒత్తిడి కారణంగానే తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిందనదని స్పష్టం చేసారు.

ఆ సమయంలో కాంగ్రెస్ ఎంపీలు పెప్పర్ స్ప్రేను ఉపయోగించిన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. తెలంగాణకు అడ్డంకులు కల్పించిన కాంగ్రెస్ తామే తెచ్చామంటూ చెప్పుకోవడాన్ని ఆయన ఖండించారు. బీజేపీ ఒత్తిడి కారణంగానే తెలంగాణ ఏర్పడిందని ఆయన తెలిపారు.