నేడు ‘ఆయుష్మాన్ భారత్’ ప్రారంభం

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం ప్రధానమంత్రి జన్ ఆరోగ్య అభియాన్ యోజన (పీఎంజేఏవై)ను ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం జార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రారంభిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సేవల పథకంగా పేరున్న ఆయుష్మాన్ భార త్- జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం (ఏబీ-ఎన్‌హెచ్‌పీఎ) లబ్దిదారులైన కుటుంబానికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తుంది.

 గ్రామీణ పేదరిక, అణగారిన వర్గాలు, గుర్తింపు పొందిన 11 వృత్తుల పట్టణ కార్మికులతో కలిపి మొత్తం 10 కోట్ల కుటుంబాలకు చెందిన 50 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ వర్తిస్తుంది. తాజా సామాజిక ఆర్థిక కుల గణన (ఎస్‌ఈసీసీ) వివరాల ప్రకారం గ్రామాల్లో 8.04 కోట్లు, పట్టణాల్లో 2.33 కోట్ల కుటుంబాలకు వర్తింపజేస్తారు. ఈ పథకంలో చేరిన వారికి ప్రభుత్వ, లిస్టెడ్ ప్రైవేట్ దవాఖానల్లో సేవలు లభిస్తాయి. ఎస్‌ఈసీసీ వివరాల ప్రకారం గ్రామాల్లో అణగారిన వర్గాల ను డీ1, డీ2, డీ3, డీ4, డీ5, డీ7గా.. పట్టణాల్లో గుర్తింపు పొందిన 11 వృత్తుల కార్మికులను అర్హులుగా గుర్తించారు.

పట్టణాల్లో చెత్త వస్తువులను ఏరేవారు, బిక్షగాళ్లు, ఇంటి పని సహాయకులు, వీధి వ్యాపారులు, హాకర్లు, నిర్మాణ రంగ కార్మికులు, తాపీ పనివారు, పెయింటర్లు, వెల్డర్లు, సెక్యురిటీ గార్డులు, పారిశుద్ధ్య కార్మికులు తదితర వర్గాల వారు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. రాష్ర్టాల్లో అమలులో ఉన్న రాష్ట్రీయ స్వాస్థ బీమా యోజన (ఆర్‌ఎస్‌బీవై) పథకం లబ్ధిదారులకూ ఆయుష్మాన్ భారత్ వర్తిస్తుంది.

ఈ పథకం కింద కరోనరీ బైపాస్, స్టెంట్లు తదితర 1,354 ఆరోగ్య ప్యాకేజీలు అమలవుతాయి. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్) కంటే 15-20% చౌకకే వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ పథకంలో చేరే కుటుంబాలు రూ.2000 లోపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

అర్హులు ఓటరు గుర్తింపు కార్డుతో గానీ, రేషన్‌కార్డుతో గానీ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కోసం ఆధార్ నంబర్ నమోదు తప్పనిసరికాదు. పథకం గురించి తెలుసుకునేందుకు మేరా.పీఎంజేఏవై.గవ్.ఇన్ అనే పేరుతో ఒక వెబ్‌సైట్‌ను ఒక హెల్ప్ లైన్ నంబర్ (14555)ను సంప్రదించొచ్చు. ఈ పథకం అమలు కోసం కేంద్రం తో 31 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఎంవోయూలపై సంతకాలు చేశాయి.