కేసీఆర్ నిరంకుశ పాలనకు భువనగిరి నుండే చరమగీతం    

తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న కల్వకుంట్ల నియంతృత్వ పాలనకు చరమగీతం భువనగిరి నుండే ప్రారంభమవుతుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట సాధనకోసం ప్రారంభమైన మలివిడత తెలంగాణ  ఉద్యమం భువనగిరి నుండే ప్రారంభమైందని గుర్తు చేశారు. అదేవిధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన అంతానికి ఉద్యమం సైతం భువనగిరి నుండే ప్రారంభం కానుందని తెలిపారు.  

యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ అధ్యక్షుడు పి వి. శ్యాంసుందర్‌రావు ఆధ్వర్యంలో నిర్మించనున్న బీజేపీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణానికి డాక్టర్ లక్ష్మణ్ విచ్చేసి భూమిపూజ జరుపుతూ తెలంగాణ సాధన ఉద్యమంలో ముఖ్యపాత్ర వహించిన ఆర్టీసీ కార్మికులు హక్కుల సాధనకోసం 56 రోజుల సమ్మెను కేసీఆర్ ఉక్కుపాదంతొ అణగదొక్కి కార్మికుల పట్ల కర్కశంగా వ్యవరించారని దుయ్యబట్టారు. ఒకవైపు అత్యున్నత న్యాయస్థానం మొట్టికాయలు వేసినా మొండి వైఖరి ఆవలంభించారని ధ్వజమెత్తారు. 

కేంద్ర ప్రభుత్వానికి 33 శాతం వాటా ఉన్నా కేసీఆర్ ఆర్టీసీని ప్రయివేటుపరం చేయాలనే ఉద్దేశానికి కార్మిక యూనియన్లు అడ్డుపడుతున్నాయన్న కక్షతోనే సమ్మెను నిర్వీర్యం చేశారని అన్నారు. ఉద్యోగ సంఘాలు ఆర్టీసీ సమ్మెకు మద్దతు పలకగానే ఉలిక్కిపడ్డ ఆయన పీఆర్‌సీ ప్రకటిస్తానని ఐఆర్ బకాయిలు విడుదల చేస్తానని ప్రలోభాలకు గురిచేసి ఆర్టీసీ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుటిల యత్నం చేశాడని లక్ష్మణ్ ఆరోపించారు. 

బీజేపీ కేసీఆర్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా నూతన సంవత్సరాదినుంచిఉద్యమించనుందని వెల్లడించారు. టీఆర్‌ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను పక్కదారి పట్టించిన వైనాన్ని ప్రజలకు తెలియజేసీ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పేద ప్రజలకు బీజేపీ అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తామని లక్ష్మణ్ హామీనిచ్చారు. 

రాష్ట్రంలో పాలన మూడు బార్లు ఆరు వైన్స్‌లుగా కొనసాగుతోందని అందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం విధానమే కారణమని లక్ష్మణ్ విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా బడులను మూసివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి బార్లు తెరిచి మద్యం కల్చర్‌ని ప్రవేశపెట్టడంలో తలమునకలై ఉందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పబ్ కల్చర్ మహిళలపై అత్యాచారాలను ప్రేరేపించేదిలా ఉందని మండిపడ్డారు. 

మహిళలపై జరుగుతున్న దాడులకు ముఖ్యమంత్రి కేసీఆర్ కారకులౌతున్నారని ఆరోపించారు. విద్యాసంస్థలను మూసి బార్లు, వైన్లు తెరిచేందుకు అనుమతించడంతో యువత పెడదారి పడ్తోందని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా భాగ్యనగరానికి ఉన్న బ్రాండ్‌ను బ్రాందీనగర్‌గా మార్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని దుయ్యబట్టారు.