కాంగ్రెస్-జేడీఎస్‌లు ఒక్కటవడం వెర్రివారి మాటలు 

ఉప ఎన్నికల తరువాత తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్-జేడీఎస్‌లు ఒక్కటయ్యే అవకాశాలు ఉన్నాయని వెలువడిన సంకేతాలను కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప పనికిమాలినవిగా తోసిపుచ్చారు. అలాంటి వ్యాఖ్యలకు ఎలాంటి విలువ లేదని స్పష్టం చేశారు. 

ఎన్నికలు జరుగనున్న 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నూటికి నూరు శాతం బీజేపీ అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నిక జరుగుతున్న శివాజినగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొన్న యెడియూరప్ప విలేఖరులతో మాట్లాడుతూ ప్రజలు ప్రతిపక్షాలకు తగిన సమాధానం ఇస్తారని చెప్పారు.

ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ప్రజలు బీజేపీతోనే ఉన్నారనే వాస్తవాన్ని కాంగ్రెస్, జేడీఎస్‌లు గ్రహిస్తాయని ఆయన భరోసా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల తరువాత తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తాము ఒక్కటయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కాంగ్రెస్, జేడీఎస్‌లు ఇచ్చిన సంకేతాలపై ప్రశ్నించగా, ‘వెర్రివాళ్లే అలాంటి మాటలు మాట్లాడతారు’ అంటూ ఎద్దేవాచేశారు. 

ఉప ఎన్నికలు జరుగుతున్న అన్ని నియోజకవర్గాల్లోనూ బీజేపీయే గెలుస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ చావుదెబ్బ తిని, ప్రతిపక్షంగానే మిగిలిపోతుందని తేల్చి చెప్పారు. మిగిలిన మూడున్నరేళ్ల పాటు బీజేపీయే ప్రభుత్వంలో ఉంటుందని యెడియూరప్ప ధీమా వ్యక్తం చేశారు.