సముద్రంలాంటోడిని.. కచ్చితంగా తిరిగివస్తా 

తనపై వస్తున్న విమర్శలకు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత  దేవేంద్ర ఫడ్నవీస్‌ ఘాటుగా సమాధానం ఇచ్చారు. ‘కెరటం వెనక్కి వెనక్కి వెళ్లిందని.. తీరంలో ఇల్లు కట్టుకోవాలని చూడొద్దు. నేను సముద్రంలాంటివాడిని. కచ్చితంగా తిరిగివస్తా’ అని ఓ పద్యాన్ని చదవి వినిపించారు.

‘నేను మళ్లీ వస్తాను’ అని ఎన్నికల ముందు తను చెప్పిన మాటపై ముఖ్యమంత్రితో సహా సభలో అనేకమంది నాయకులు విపరీత వ్యాఖ్యలు చేయడంతో ఆయన స్పందించారు. ‘నేను అలా అన్నది నిజమే. అయితే అందుకు కాలపరిమితిని చెప్పడం మరిచిపోయానని చెబుతూ ఫడ్నవీస్ ‘అందుకు మీరు కాస్త ఓపిక పట్టాలి. కొంతకాలం వేచి ఉండాలి అని మాత్రం చెప్పగలను.  

`నేను సీఎంగా ఉన్నప్పుడు అనేక ప్రాజెక్టులు ప్రకటించా. వాటిలో కొన్నింటికే ప్రారంభోత్సవాలు చేశా. నేను మళ్లీ వచ్చి వాటికి శంకుస్థాపన చేస్తానని మీరు కలలో కూడా ఊహించలేరు’ అని ఫడ్నవీస్‌ పేర్కొన్నారు. 

అతిపెద్ద ఏకైక పార్టీగా బిజెపి ప్రజామోదం పొందింది. అక్టోబర్ 21న జరిగిన ఎన్నికల్లో మాకు 70 శాతం ఓట్లు వచ్చాయి. కానీ, రాజకీయ పరమైన లెక్కలదే పైచేయి కావడంతో ఎన్నికల్లో దాదాపు 40 శాతం మాత్రమే ఓట్లు వచ్చిన వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్యంలో ఒక భాగంగా మేము దాన్ని అంగీకరిస్తున్నాం’ అని దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. 

‘కొన్ని సిద్ధాంతాలను బట్టే ప్రభుత్వంపట్ల నా వ్యతిరేకత. అంతేకానీ వ్యక్తిగత కారణంతో కాదు’ అని కూడా మాజీ సిఎం చెప్పారు.  ప్రజల తీర్పుపై రాజకీయ గణితం (పొలిటికల్ అర్థమెటిక్) ఆధిపత్యం వహించినందువల్లే మహారాష్ట్ర అసెంబ్లీలో అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ బిజెపి అధికారంలోకి రాలేకపోయిందని తెలిపారు.