మహారాష్ట్ర స్పీకర్‌ గా నానా పటోలే 

మహారాష్ట్ర స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ అభ్యర్థి నానా పటోలే ఎలాంటి పోటీలేకుండా అసెంబ్లీ స్పీకర్‌గా ఆదివారంనాడు ఎన్నికయ్యారు. స్పీకర్ పోస్టు వివాదం కాకూడదనే కారణంతో రేసు నుంచి బీజేపీ తప్పుకోవడంతో ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని 'మహా వికాస్ అఘాడీ' కూటమికే స్పీకర్ పదవి దక్కింది.

తొలుత తమ స్పీకర్ అభ్యర్థిగా కిసాన్ థోరేను బీజేపీ బరిలోకి దింపింది. అయితే, అసెంబ్లీ ప్రతిష్టను పరిగణలోకి తీసుకుని స్పీకర్ పదవిని పోటీలోకి లాగరాదని పలువురు ఎమ్మెల్యేలు చేసిన విజ్ఞప్తితో బీజేపీ తమ అభ్యర్థిని ఉపసంహరించుకుంది. దీంతో పటేలే ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రొటెం స్పీకర్ దిలీప్ వాల్సే పాటిల్ అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాగానే ప్రకటించారు. 

దీంతో పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ప్రతిపక్ష నేత దేవేండ్ర ఫడ్నవిస్ సహా ఎమ్మెల్యేలంతా నానా పటోలేకు అభినందనలు తెలిపారు. ప్రొటెం స్పీకర్, ముఖ్యమంత్రి స్వయంగా నానా పటోలేను స్పీకర్ చైర్‌‌ వరకూ తోడ్కొని వెళ్లి కూర్చోబెట్టడంతో సభలో అహ్లాదకర వాతావరణం కనిపించింది.

విదర్భ ప్రాంతంలో పటోలే పెద్ద పేరున్న నేత. మొదటి దఫాలో ఏర్పడ్డ మోదీ సారథ్యంలోని ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన మొదటి నేత కూడా నానా పటోలేకు పేరుంది. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ తిరుగుబాటు నేతగా ఆ పార్టీని వదిలిపెట్టిన పటోలె ఆ వెంటనే కాంగ్రెస్‌లో చేరారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిపై పోటీ చేసి ఓడిపోయారు. పటోలే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.