బీజేపీలో చేరిన సినీ నటి నమిత 

తెలుగు, తమిళంలో పలు సినిమాలలో నటించిన సినీ నటి నమిత బిజెపిలో చేరారు. మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత సమక్షంలో ఆమె 2016లో అన్నాడీఎంకే పార్టీలో చేరారు. తాజాగా ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. 

ఆమె వెంట తమిళనాడు బీజేపీ నేతలు ఉన్నారు. తమిళనాట అధికారంలోకి రావాలని కలలుగంటున్న బీజేపీకి నమిత పార్టీలో చేరడంతో ఆమె ఇమేజ్ ఏమేరకు కలిసివస్తుందో చూడాలి. తమిళనాడులో నమితకు భారీ సంఖ్యలో అభిమానులున్నారు. గతంలో ఆమెకు ఒక గుడిని కూడా కట్టారు. 

నమిత.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నమిత.. తెలుగు అగ్రహీరోలు బాలయ్యతో ‘సింహా’, వెంకటేశ్‌‌తో ‘జెమిని’ సినిమాలో నటించారు.  గుజరాత్ కు చెందిన నమిత సినీ రంగంలో తనను ఆదరించిన తమిళనాడు నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు సినిమా 'సొంతం'తో సినీరంగ ప్రవేశం చేసింది.