టీడీపీకి పట్టిన గతినే వైసీపీకి కూడా  

ప్రజాసమస్యలపై నిత్యం పోరాడుతూ.. ప్రజలతో బీజేపీ మమేకమైతే రాబోయే ఎన్నికల్లో టీడీపీకి పట్టిన గతినే వైసీపీకి కూడా పట్టించవచ్చని ఏపీ బీజేపీ నేతలు స్పష్టం చేశారు. కేవలం ఆరు నెలల కాలంలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన అనాలోచిత నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్‌ను అప్రతిష్ఠ పాల్జేశారని బీజేపీ రాష్ట్ర నేతలు మండిపడ్డారు. 

స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ర్టాన్ని అస్తవ్యస్తం చేశారని, పార్టీ కండువా కప్పు కొన్నవారికే ఉద్యోగాలిస్తున్నారని ధ్వజమెత్తారు. ఢిల్లీలో శుక్రవారం బీజేపీ ఎంపీ సుజనాచౌదరి నివాసంలో ఆ పార్టీ సీనియర్‌ నేతలతో రాజకీయ వ్యూహరచన భేటీ జరిగింది. 

దాదాపు మూడు గంటలు సాగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్‌ దేవధర్‌, రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ ఎంపీలు టీజీ వెంకటేశ్‌, జీవీఎల్‌ నరసింహారావు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.సతీశ్‌, కార్యదర్శి సత్యకుమార్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుకర్‌, తెలంగాణ ఎంపీ గరికపాటి మోహనరావు ప్రభృతులు పాల్గొన్నారు.

జగన్‌ ప్రభుత్వ వైఫల్యాలు, అనాలోచిత విధానాలు, ప్రజల్లో వ్యతిరేకత తదితర అంశాలపై కూలంకషంగా చర్చించారు. ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టి, జగన్‌ ప్రభుత్వ దూకుడుకు కళ్లెం వేయాలని అభిప్రాయపడ్డారు. ఇసుక సరఫరాపై కొత్త విధానం పేరుతో ఆరు నెలల నుంచి ఇసుక లేకుండా చేసి కూలీల పొట్టకొట్టారని విరుచుకుపడ్డారు. 

దేవుడి భూములను అన్యాక్రాంతం చేయడం, దేవదాయశాఖ నిధుల నుంచి పాస్టర్లకు జీతాలు చెల్లింపు,, జెరూసలేం వెళ్లడానికి నిధులు ఇస్తామనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆలయ భూముల జోలికి వస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. పోలీసుల అండతో వైసీపీ నేతలు అనేక దుర్మార్గాలకు పాల్పడుతున్నారని..అనేకచోట్ల బీజేపీ శ్రేణులపై తప్పుడు కేసులు బనాయిస్తూ, వేధిస్తున్నారని దుయ్యబట్టారు. 

తప్పులు ఎత్తిచూపితే ఎదురుదాడికి దిగుతున్నారని ఆక్షేపించినట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో టీడీపీ, వైసీపీలకు దీటుగా రాష్ట్రంలో బీజేపీ రాజకీయంగా ఎదగడానికి అవసరమైన ఎత్తుగడలు అమలు చేయాలని నేతలు నిర్ణయించారు. 

ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు, ధర్నాలు, అవసరమైతే రిలేదీక్షలు కూడా చేసి, ప్రజల పక్షాన నిలిచి, వారితో మమేకం కావాలని.. ఇందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించాయి. భేటీ అనంతరం కన్నా, సుజనా, సత్యకుమార్‌ మీడియాతో మాట్లాడారు. వారేమన్నారంటే.

ముఖ్యమంత్రి, మంత్రులంతా పరిపాలనను గాలికొదిలేసి, రాజకీయ కక్ష సాధింపుతోనే కాలక్షేపం చేస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. జగన్‌ ఆరు నెలలుగా ఎడమ చేయి ఏంచేస్తుందో.. కుడి చేతికి సైతం తెలియకుండా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

విపక్షాలపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని దుయ్యబట్టారు. రాజధాని అమరావతి నిర్మాణం పనులన్నీ నిలిపివేయడం దేనికి సంకేతం? నీటిపారుదల ప్రాజెక్టు పనులనూ ఆపేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రానికి వాస్తవాలు చెప్పడం లేదు? అసలీ రాష్ర్టాన్ని ఏం చేయదలచుకున్నారు? బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఉద్యోగులను పీకేసి రోడ్డున పడేయడం ఎంతవరకు సబబు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 

జగన్‌ అధికారం చేపట్టాక గత ఆరు నెలల్లో ప్రభుత్వ కార్యాలయాల రంగుల మార్పు, వ్యక్తిగత దూషణలే తప్ప చేసిందేమీ లేదని సుజనా చౌదరి విమరసంచారు. ఉచిత పథకాలకు రూ.56 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. వేల కోట్ల రెవెన్యూ లోటుతో సతమతమవుతున్న సమయంలో ఈ పథకాలకు నిధులు ఎలా సమకూర్చుతారో జగన్‌ ప్రజలకు చెప్పాలని స్పష్టం చేశారు.