ఇవిఎంల ట్యాంపరింగ్ చేసి ఉండవచ్చు 

పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో ఓటమి కావడం వెనుక ఏదో కుట్ర జరిగిందని బిజెపి అనుమానం వ్యక్తం చేసింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ ఇవిఎంలను ట్యాంపరింగ్ చేసి ఉండవచ్చన్న సందేహాన్ని కూడా బిజెపి వెలిబుచ్చింది. 

బిజెపి జాతీయ కార్యదర్శి, బెంగాల్ బిజెపి నాయకుడు రాహుల్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికలలో రాష్ట్ర అధికార యంత్రాంగం అధికార టిఎంసికి బహిరంగంగా సహాయపడిందని ఆరోపించారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. 

అన్ని ఎన్నికలను ఎన్నికల కమిషన్ పర్యవేక్షిస్తుందని, అయితే ఉప ఎన్నికల నిర్వహణ రాష్ట్రమే చూసుకుంటుందని ఆయన తెలిపారు. ఎన్నికల్లో గెలిచేందుకు టిఎంసి ఎంతకైనా తెగిస్తుందని ఆయన దయ్యబట్టారు.

ఇవిఎంలపై కూడా ఆయన అనుమానాలు లేవనెత్తారు. ఇవిఎంలతో ఏమైనా చేయవచ్చని, వోట్ల లెక్కింపులో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడినా ఆశ్యర్యపోనక్కర్లేదని ఆయన విమర్శించారు.