30 నుండి 40 మంది టీఆర్‌ఎస్ అభ్యర్ధుల మార్పు తప్పదా !

అసెంబ్లీ రద్దు రోజుననే 105 మంది అభ్యర్ధులను ప్రకటించడం ద్వారా సంచలనం సృష్టించిన టీఆర్‌ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు ఇప్పుడు అభ్యర్ధులపై పార్టీలో అసమ్మతి సెగలు ఎగసిపడుతునే ఉండడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అనూహ్యంగా పార్టీ ముఖ్య నేతలు ఒకొక్కరూ అసమ్మతి బాట పడుతూ ఉండడంతో దిక్కుతోచని పరిస్థితులు నెలకొంటున్నాయి. కెసిఆర్ ప్రకటనల పట్ల ఇప్పటి వరకు పార్టీలో బహిరంగంగా ఇంతమంది అసమ్మతి వ్యక్తం చేయడం గతంలో ఎన్నడూ జరగనే లేదు.

ఎంపిక చేసిన అభ్యర్ధుల పట్ల అసమ్మతి వ్యక్తం చేయడమే కాకుండా, నిరసనగా భారీ ప్రదర్శనలు జరపడం, నియోజక వర్గాలలో సమావేశాలు జరపడం, అభ్యర్ధిని మార్చవలసిందే అంటూ కెసిఆర్ ను డిమాండ్ చేయడం, మార్చాక పోతే ఇతర పార్టీల నుండి, స్వతంత్రంగానో పోటీ చేసి ఆయన ఎంపిక చేసిన అభ్యర్ధిని ఓడిస్తామని అల్టిమేటం ఇస్తూ ఉండటం జరుగుతున్నది. అసమ్మతి వ్యక్తం చేస్తున్న వారిని సర్దుబాటు చేసే ప్రయత్నాలు పలుచోట్ల జరుగుతున్నా ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు.

అభ్యర్థుల ప్రకటన తర్వాత అసంతృప్తి వ్యక్తం కావడం మాములేనని, నాలుగైదు రోజుల తర్వాత అంతా సర్దుకుంటుందని భావించిన టీఆర్‌ఎస్ అధిష్ఠానంకు ఈ పరిణామాలు విభ్రాంతి కలిగిస్తున్నాయి. అభ్యర్థులను ప్రకటించి రెండు వారాలు గడుస్తున్నా అసమ్మతి రోజు రోజుకు పెరగడమే తప్ప తగ్గేలా కనిపించక పోవడం పట్ల హైకమాండ్ ఆందోళన చెందుతోంది. అభ్యర్ధుల ఎంపికలో, ప్రకటించడంలో  కెసిఆర్ తొందర పడ్డారని, పొరపాటు చేసారని ఇప్పుడు సీనియర్ నాయకులు సహితం అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. చివరకు కెసిఆర్ కుమారుడు, మంత్రి కేటి రామారావు సహితం అటువంటి అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తున్నది.

తాజాగా టీఆర్‌ఎస్ వ్యవస్థాపక సభ్యుడు, ఎమ్మెల్సీ రాములు నాయక్ తిరుగుబాటు బావుటా ఎగరేయడానికి సిద్ధం కాగా, నల్లగొండ జిల్లా మునుగోడులో తాజా మాజీ ఎమ్మెల్యేకు తిరిగి టిక్కెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ మండల కేంద్రంలో బహిరంగ సభ జరిగింది. ఇక్కడి నుంచి టికెట్ ఆశించి భంగపడిన తిరుగుబాటు అభ్యర్థి వేనేపల్లి వెంకటేశ్వర్‌రావు పదివేల మందితో సభ నిర్వహించి అధినాయకత్వానికి షాక్ ఇచ్చారు.

పార్టీ నాయకత్వాన్ని తిరుగుబాటు అభ్యర్ధుల బెడద పట్టుకొంది. అందుకనే మరో కొన్ని నియోజకవర్గాల అభ్యర్ధులను నాలుగైదు రోజులలో ప్రకటించి ఇప్పుడా ఊసే ఎత్తడం లేదు. ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్ధులలో 30 నుండి 40 మందిని మారిన పరిస్థితులలో మార్చాక తప్పదని భావిస్తున్నారు. ఎన్నికల ప్రకటన జరిగే వరకు అభ్యర్ధుల ప్రకటన ఇక ఉండదని తెలుస్తున్నది.

ఇలా ఉండగా తన ఎమ్మెల్సీ పదవికి రెండు మూడు రోజులలో రాజీనామా చేయాలని రాములు నాయక్ నిర్ణయించారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ నుంచి టిక్కెట్ ఆశించిన రాములుకు టికెట్ దక్కక పోవడంతో పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. వచ్చే ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని నాయక్ ప్రకటించారు. ఈ సమావేశానికి గిరిజన సంఘాలతో పాటు ఉద్యోగ, వైద్య, న్యాయవాద, విద్యార్థి సంఘాలు, మేధావి వర్గాలు హాజరయ్యారు.

గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన కెసిఆర్ ఆ హామీని నిలబెట్టుకొనే ప్రయత్నం చేయక పోవడంతో ఆ వర్గాలో అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. దానితో జనరల్ సీట్లలో కనీసం 20 స్థానాల్లో గెలుపు, ఓటములను ప్రభావితం చేయగల స్థాయిలో తమ జనాభా ఉందని, ఈ సీట్లనైనా ఇవ్వాలని ఆ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ మద్దతు లేకుండానే స్వతంత్రంగా 20 స్థానాలలో పోటీ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

ఇలా ఉండగా ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నుంచి టీఆర్‌ఎస్ టిక్కెట్ ఆశించిన మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, ఆయన భార్య మాజీ ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. భూపాల్‌పల్లి టికెట్ ఆశించిన భంగపడిన గండ్ర సత్యనారాయణరావును బుజ్జగించే ప్రయత్నాలు ఫలించలేదు. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే స్పీకర్ సిరికొండ మధుసూదనాచారికే పార్టీ తిరిగి టికెట్ ప్రకటించింది.

గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గణనీయంగా ఓట్ల సాధించిన గండ్ర సత్యనారాయణరావుకు టిక్కెట్ ఇస్తామన్న హామీతో టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. అయితే అభ్యర్థుల ఎంపికలో తన పేరు లేకపోవడంతో గండ్ర తిరుగుబాటు బావుటా ఎగరేశారు. ఆయనను బుజ్జగించేందుకు హైదరాబాద్‌కు రావాల్సిందిగా అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చినా తిరస్కరించినట్టు తెలిసింది. .