కర్ణాటకలో బిజెపి అనుకూల పవనాలు 

కీలకమైన అసెంబ్లీ ఉపఎన్నికలు జరుగుతున్న కర్ణాటకలో ప్రస్తుతం బీజేపీ అనుకూల పవనాలు వీస్తున్నట్లు స్పష్టం అవుతున్నది. ఈ మేరకు ఇంటిలిజెన్స్‌ వర్గాలు ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించినట్టు తెలుస్తోంది. 15 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల ద్వారా బీజేపీ ప్రభుత్వాన్ని పటిష్టం చేసుకోవాలని భావిస్తుండగా ఎక్కువ సీట్లు సాధించి సర్కార్‌ను కూల్చాలనే కాంగ్రెస్‌ వ్యూహాలు పన్నింది. 

అయితే కమలం వైపై ఫలితాలు ఉంటాయని ఇంటలిజెన్స్‌ ద్వారా తెలుస్తోంది. 9 చోట్ల ముందంజలో ఉండగా ఆరు చోట్ల తీవ్రమైన పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. బెంగళూరు నగర పరిధిలోని మహాలక్ష్మీ లేఅవుట్‌, కె.ఆర్‌.పురం, శివాజీనగర్‌, చిక్కబళ్ళాపుర, హిరేకరూరు, విజయనగర్‌, అథణి, కాగవాడ, యల్లాపురలో కమలం వైపు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక యశ్వంతపుర రాణి బెన్నూరు, గోకాక్‌, హుణసూరు, కె.ఆర్‌.పేట, హొసకోటలో తీవ్రమైన పోటీ నెలకొంది.

చివరి మూడు రోజుల్లో జరిగే మార్పులు ఫలితాలను నిర్ణయిస్తాయని చెప్పవచ్చు. మహాలక్ష్మీ లేఅవుట్‌లో బీజేపీ అభ్యర్థి గోపాలయ్యకు కాంగ్రెస్‌, జేడీఎస్‌ అభ్యర్థులు అంతగా పోటీ ఇవ్వడం లేదనిపిస్తోంది. కె.ఆర్‌.పురంలోనూ ఇదే పరిస్థితి నెలకొనగా చిక్కబళ్ళాపురంలో సుధాకర్‌, హిరేకరూరులో బీసీ పాటిల్‌, యల్లాపురలో శివరామ్‌ హెబ్బార, కాగవాడలో శ్రీమంతపాటిల్‌, అథణిలో మహేష్‌ కుమటహళ్ళి, విజయనగర్‌లో ఆనంద్‌సింగ్‌లు ఓ అడుగు ముందు ఉన్నట్లు తెలుస్తోంది.

హొసకోటలో బీజేపీ అభ్యర్థి ఎం.టి.బి.నాగరాజ్‌కు ఇండిపెండెంట్‌ అభ్యర్థి శరత్‌ బచ్చేగౌడ తీవ్రమైన పోటీ ఇస్తున్నారు. వక్కలిగలు తీసుకొనే నిర్ణయంపైనే ఫలితం ఆధారపడివుంటుంది. యశ్వంతపురలో రెండుసార్లు ఓడినా జేడీఎస్‌ అభ్యర్థి జవరేగౌడ సానుభూతి నెలకొనగా ఎస్‌.టి.సోమశేఖర్‌కు ప్రజలు బాగానే ఆదరిస్తున్నట్లు తెలుస్తోంది. 

రాణి బెన్నూరు, హుణసూరులలో పోటీ ఉన్నా చివరిదాకా ఉత్కంఠ అనిపించేలా ఉంది. 15 నియోజకవర్గాలపైన సమగ్ర నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించిన మేరకు ఇంటలిజెన్సీ వెల్లడించిన ఆధారాల ప్రకారం 9 చోట్ల సానుకూలం కానుందనే అభి ప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.