వంచనకు పాల్పడింది పవార్లు కాదు.. శివసేన 

మహారాష్ట్రలో అజిత్ పవార్ కానీ, శరద్ పవార్ కానీ తమను వంచించలేదని, ఆ పని చేసింది శివసేనేనని బిజెపి అధ్యక్షుడు, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.  ఏకైక పెద్ద పార్టీగా మహారాష్ట్రలో బీజేపీ నిలిచినప్పటికీ ఎన్‌సీపీ నేత అజిత్ పవార్‌ మద్దతు తీసుకోవాలనుకోవడం, అజిత్ పవార్ బీజేపీకి మద్దతిచ్చినట్టే ఇచ్చి ఉపసంహరించుకోవడం వంటి పరిణామాలపై ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పందించారు. 

అజిత్ పవార్ మద్దతు తీసుకోవాలన్న పార్టీ నిర్ణయం పొరపాటుగా భావించనక్కర్లేదని చెప్పారు. 'ఎన్‌సీపీ ఎప్పుడూ మాపై పోరాటం సాగిస్తూనే వచ్చింది. శివసేనే వంచనకు పాల్పడింది' అని ఆయన పేర్కొన్నారు. సమీప భవిష్యత్తులో మళ్లీ శివసేన-బీజేపీ కలిసి పనిచేసే అవకాశాలపై అడిగినప్పుడు, ఇప్పుడే తానేమీ చెప్పలేనని అమిత్‌షా సమాధానమిచ్చారు. 

'వంచనకు గురైనప్పుడు సహజంగానే కార్యకర్తలు ఆగ్రహించడం సహజం. ఇంతకు మించి ఏమీ చెప్పదలచుకోలేదు' అని పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఏమి జరిగిందో యావద్దేశానికి తెలుసునని, బీజేపీ-శివసేన కలిసి ఎన్నికల్లో పనిచేసిందని, బీజేపీకి అనుకూలంగా తీర్పువచ్చిందని చెప్పారు. 

గెలిచిన తర్వాత శివసేన వేరే డిమాండ్లతో ముందుకు వచ్చిందని అమిత్ షా ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి పదవిని పంచుకునేందుకు బీజేపీ ఎలాంటి ఆఫర్ ఇవ్వలేదని, కూటమి మళ్లీ అధికారంలోకి వస్తే ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగానే కొనసాగుతారని ఎన్నో ర్యాలీల్లో చెప్పడం జరిగిందని గుర్తు చేశారు.

బీజేపీ ఎప్పడూ బేరసారాలకు పాల్పడదని, కాంగ్రెస్ పార్టీనే అందుకు పాల్పడిందని తప్పుపట్టారు. శివసేనతో ఎందుకు చేతులు కలపాల్సి వచ్చిందో సమాధాన చెప్పాల్సింది కూడా ఆ పార్టీయేనని స్పష్టం చేశారు. సిద్ధాంతాలే బీజేపీకి సుప్రీం అని, ఆ విషయంలో తమ పార్టీ ఎన్నటికీ రాజీపడదని అమిత్‌షా పేర్కొన్నారు.

ప్రస్తుతం మహారాష్ట్రలో అధికారం చేపట్టిన మూడు పార్టీలకు అధికార దాహం తప్పా ఆశయాల సామీప్యహత ఏమాత్రం లేదని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర గవర్నర్ పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ప్రజాస్వామ్యానికి ఆర్గ్యకరం కాదని అమిత్ షా హితవు చెప్పారు. 

గవర్నర్ భగత్ సింగ్ కొశ్యరిపై చేస్తున్న విమర్శలు సహేతుకం కాదని చెబుతూ ప్రభుత్వం ఏర్పాటుకు ఎవరైనా ముందుకు వస్తారా అని గవర్నర్ 18 రోజులు వేచి చుసారిని గుర్తు చేశారు.