కుమారస్వామి, సిద్దరామయ్యపై పరువు నష్టం దావా

కాంగ్రెస్ నేత సిద్ద రామయ్య, జేడీఎస్ నేత కుమారస్వామిలపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప హెచ్చరించారు. డిసెంబర్ ఐదో తేదీన జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్వాల్ నియోజకవర్గంలో యడియూరప్ప పర్యటిస్తూ ‘సిద్ద రామయ్య, కుమారస్వామిలపై పరువు నష్టం దావా వేయనున్నాను.. ఇందుకు అవసరమైన ఆధారాలను సేకరిస్తున్నాను’ అని ప్రకటించారు. 

అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలను ధన బలంతో కొనుగోలు చేశారని సిద్ద రామయ్య చేసిన ప్రకటనను ఉటంకిస్తూ యడియూరప్ప ఈ ప్రకటన చేశారు. ఆ ఇద్దరు నేతలూ తనపై బాధ్యతారహితంగా, పరువును దెబ్బతీసే విధంగా ప్రకటనలు చేశారనీ.. దీనిపై వీలైనంత త్వరగా పరువునష్టం దావా వేసేందుకు చర్యలు చేపడుతున్నానని ఆయన వివరించారు. 

తమపై అమర్యాదపూర్వకంగా ప్రకటనలు చేసిన ఇద్దరు నేతలపై చర్య తీసుకొనే సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 15 అసెంబ్లీ స్థానాల్లో మొదటి విడత ప్రచారం పూర్తి చేశానని.. డిసెంబర్ మూడో తేదీలోగా రెండో విడత ప్రచారాన్ని ముగించనున్నట్లు యడియూరప్ప చెప్పారు. ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీకి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందనీ సంతోషం వ్యక్తం చేశారు. 

15 స్థానాల్లో కచ్చితంగా తాము గెలుస్తామని యడియూరప్ప ధీమా వ్యక్తం చేశారు. ఇంతవరకు కాంగ్రెస్, జేడీఎస్ నేతలెవరూ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఎక్కడా ప్రకటించలేదని ఈ సందర్భంగా యడియూరప్ప పేర్కొన్నారు.