92 శాతం హామీలు అమలు చేసిన బీజేపీ ప్రభుత్వం 

జార్ఖండ్‌లోని బీజేపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన 92 హామీలు అమలు చేసినట్టు పబ్లిక్ పాలసీ రీసెర్చీ సెంటర్ (పీపీఆర్‌సీ) ప్రకటించింది. 2014 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ తూ.చ. తప్పకుండా అమలు చేసినట్టు స్పష్టం చేశారు. పీపీఆర్‌సీ ఉపాధ్యక్షుడు వినయ్ సహస్రాబుద్ధే మాట్లాడుతూ జార్ఖండ్ ప్రభుత్వం పాలనాపరంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని వెల్లడించారు. 

బీజేపీకి అనుబంధంగా పనిచేసే పీపీఆర్‌సీకి పార్టీ ఉపాధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు వినయ్ సహస్రాబుద్ధే చీఫ్‌గా ఉన్నారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయడం, సుపరిపాలన అందించి ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నట్టు ఆయన స్పష్టం చేశారు.  ముఖ్యమంత్రి రఘువర్ దాస్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు.

మహిళలు 50 లక్షల విలువైన స్థలం కొనుగోలుకు కేవలం 1 రూపాయితోనే రిజిస్ట్రేషన్ చేసుకునే వినూత్న పథకం అమలు చేసినట్టు ఆయనచెప్పారు. దీని ప్రకారం రాష్ట్రంలో 55వేల మంది మహిళలను భూ యజమానులుగా చేసిన ఘనత బీజేపీకి దక్కుతుందని ఆయన తెలిపారు. రఘువీర్ దాస్ నాయకత్వంలో గ్రామీణాభివృద్ధి, రైతు కుటుంబాల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్టు వెల్లడించారు.

ముఖ్యమంత్రి కృషి ఆశీర్వాద్ యోజన కింద 22.76 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులు లబ్ధిపొందారని పేర్కొన్నారు. ఐదువేలు నుంచి 25 వేల రూపాయలు రైతులకు అందించినట్టు తెలిపారు. అలాగే ఒక ఎకరం నుంచి ఐదెకరాల భూమిని పీఎం కిసాన్ సమ్మన్ యోజన కింద అందజేసినట్టు వినయ్ పేర్కొన్నారు. 

సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చినట్టు పీపీఆర్‌సీ డైరెక్టర్ సుమీత్ భాసిన్ వెల్లడించారు. బీజేపీ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని ఆయన పేర్కొన్నారు. తేజస్వినీ పథకం కింద రూ. 600 కోట్లతో చేపట్టిన కార్యక్రమాలు యువతులకు ప్రయోజనం చేకూర్చామని వివరించారు. 

తేజస్వీ క్లబ్‌లు ఏర్పాటు చేసి విద్య, వృత్తి విద్యలో శిక్షణ ఇప్పించినట్టు భాసిన్ పేర్కొన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30, డిసెంబర్ 20 మధ్య జరగనున్నాయి. అధికార బీజేపీ జేఎంఎం- కాంగ్రెస్ కూటమిని ఎదుర్కొనబోతోంది.