అంబేద్కర్‌ను ఓటు బ్యాంకుగా మార్చుకున్న కాంగ్రెస్ 

కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్‌ను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుందే తప్ప ఆయనకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. అంబేద్కర్ భరతమాత ముద్దుబిడ్డ.. అని ఆయనకు ఒక కులానికి, మతానికి ఆపాదించ వద్దని సూచించారు. 

బిజెపి ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొంటూ భిన్నత్వంలో ఏకత్వం ప్రాతిపదికగా అందరికీ సమానత్వం కల్పించిన ఘనత భారత రాజ్యాంగానిదే అని తెలిపారు. ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అధ్యయనం చేసి భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రూపొందించారని పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అంటూ అందరికీ సమానత్వం కల్పించారని చెప్పారు. 

1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించగా, 2015 నుంచి మోదీ రాజ్యాంగ దినోత్సవంగా జరపాలని నిర్ణయించినట్లు చెప్పారు. పేదల సంక్షేమానికి ప్రధాని మోదీ 130 సంక్షేమ కార్యక్రమాల అమలు చేస్తున్నారని తెలిపారు. ఆ పథకాలు తమ సొంత పథకాలుగా రాష్ట్రాలు స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేసుకుంటున్నాయని విమర్శించారు. 

300 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దేశంలో అంబేద్కర్ నడయాడిన ఐదు ప్రాంతాలను గుర్తించి పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారని వెల్లడించారు. 

కాగా, దేవాలయ భూముల విషయంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీరు ఆక్షేపణీయంగా ఉందని ధ్వజమెత్తారు. అనేకసార్లు లేఖలు కూడా రాశాం.. గత సీఎం ఆలయాలు కూల్చి ఆస్తులు తాకట్టు పెడితే జగన్ ప్రభుత్వం ఏకంగా దేవాలయ ఆస్తులను అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. 

అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి... ప్రభుత్వ ఆస్తులు అమ్ముతున్నారని విమర్శించారు. ఈ మధ్య ద్వారకా తిరుమలకు చెందిన భూమి వేలానికి పెట్టారని, మంగళగిరి పానకాలస్వామి ఆలయ భూములు అమ్మాలని చూస్తున్నారని మండిపడ్డారు.