పీడీ అకౌంట్లపై సిబిఐ విచారణ కోరిన జివిఎల్

ఆంధ్రప్రదేశ్‌లో పీడీ అకౌంట్ల పేరిట భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న బిజేపి  రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు సీబీఐ విచారణకు డిమాండ్‌ చేశారు. ఈమేరకు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌కు శనివారం లేఖ రాశారు.

పీడీ అకౌంట్ల నుంచి నగదు ఉపసంహరణలో అక్రమాలు జరిగాయని కాగ్‌ తేల్చినట్లు లేఖలో ప్రస్తావించారు. రాష్ట్ర పీడీ అకౌంట్స్‌లో భారీ ఎత్తున నగదును జమ చేయడంపై సీబీఐ విచారణ, కాగ్ స్పెషల్ ఆడిట్ కు ఆదేశించాలని లేఖలో కోరారు. పీడీ అకౌంట్స్‌లో భారీ స్కామ్ జరిగిందని ఆరోపించారు. సుమారు రూ. 53,038 కోట్ల ప్రజాధనాన్ని పీడీ అకౌంట్స్‌లో ప్రభుత్వం వేసిందని తెలిపారు. మొత్తం 58,038 పీడీ అకౌంట్లను ఏపీ ప్రభుత్వం తెరిచిందని పేర్కొన్నారు. 2016-17 కాగ్ రిపోర్టును చూస్తే, భారీ కుంభకోణం జరిగినట్టు తెలుస్తోందని చెప్పారు. 

సీబీఐ విచారణకు ఆదేశించాలని గవర్నర్‌ను కోరారు. గత కొన్ని రోజులుగా బిజెపి, టిడిపిల మధ్య పీడీ అకౌంట్ల వ్యవహారంపై మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.