షోకాజ్ నోటీసుపై రాజగోపాల్‌రెడ్డి ఎదురు దాడి

కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నియమించిన కమిటీలపై రేగిన చిచ్చు కొనసాగుతూనే ఉంది. పార్టీ క్రమశిక్షణ సంఘం అత్యవసరంగా సమావేశమై మందలింపులు, షోకాజ్ నోటీసులను జారీచేసినా పార్టీ నేతల ఆగ్రహం మాత్రం చల్లారడం లేదు. సీనియర్ నేత వీ హనుమంతరావు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డికి తాజాగా మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కూడా జతకలిశారు. డీకే అరుణ సైతం కమిటీల కూర్పుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తున్నది.

రాష్ట్ర పార్టీ ఇన్ చార్జ్ కుంతియాపై తీవ్ర వాఖ్యలు చేసిన తనకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కుంతియాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రాజగోపాల్‌రెడ్డికి శుక్రవారం షోకాజ్ నోటీసు జారీ అయింది. రెండురోజుల్లో వివరణ ఇవ్వాలని కోదండరెడ్డి నేతృత్వంలోని క్రమశిక్షణ కమిటీ కోరింది. ఎన్నికల వేళ సీనియర్లు ఇలా వ్యవహరించడం మంచిది కాదని వీ హనుమంతరావును మందలించినట్లు సమాచారం.

షోకాజ్ నోటీసుపై రాజగోపాల్‌రెడ్డి వెనువెంటనే తీవ్రంగా ప్రతిస్పందించారు. తన మాటలకు కట్టుబడి ఉన్నానని.. తప్పెవరిదో తేల్చి చర్యలు తీసుకునే విచక్షణను అధిష్ఠానానికే వదిలేస్తున్నానని వ్యాఖ్యానించారు. తనకు నోటీసు పంపే దమ్ము, ధైర్యం కాంగ్రెస్ పార్టీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు. పార్టీ తనకు నోటీసు జారీచేసి రెండురోజుల సమయం ఇవ్వడమేమిటని అంటూ తానే రెండుగంటల్లో సమాధానాలిస్తున్నానని చెప్పేశారు.

ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది తాను కాదని.. పార్టీనేనని స్పష్టం చేసారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాటలు విని తమలాంటి నిజమైన నాయకులకు అన్యాయం చేస్తున్నారని, పార్టీ ఆఫీసులో కూర్చుని టికెట్లు అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. అవసరమైతే షోకాజ్‌కు బదులిస్తానని చెప్పారు.

కాంగ్రెస్‌ పార్టీలో కొందరు సొంత ప్రయోజనాలు, స్వార్థం కోసం తమ లాంటి యువకులను, తెలంగాణ కోసం కొట్లాడిన వారిని బలిచేస్తున్నారని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దుయ్యబట్టారు. తనను చూసి ఓర్వలేని వ్యక్తులు ఏదో ఒకటి చేసి పార్టీ నుంచి బయటకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. టికెట్లు అమ్ముకునే వారితో షోకాజ్‌ నోటీసులు పంపుతారా? అని నిలదీశారు. ‘పార్టీలో పోస్టులు అమ్ముకుంటారు. కమిటీలు వేసేందుకు డబ్బులు తీసుకుంటారు. టికెట్లు అమ్ముకుంటారు. పక్క పార్టీలతో కుమ్మక్కవుతారు. అలాంటి వాళ్లా నాకు షోకాజ్‌ నోటీసులిచ్చేది’అని ప్రశ్నించారు.

కార్యకర్తల మనోభావాలు ఏమిటో తెలియని వారు నాకు నోటీసులిస్తారా? కరుడుగట్టిన కాంగ్రెస్‌ వాదినని గుర్తించకుండా రెండ్రోజుల్లో వివరణ ఇవ్వాలంటారా? అని ప్రశ్నలు గుప్పించారు. పార్టీలో అంతర్గతంగా మాట్లాడి సూచనలు చేస్తే పట్టించుకోరని, బలంగా ఏదైనా చెబితే పక్కనపెడతారని, అందుకనే బహిరంగంగా మట్లాడాల్సి వచ్చిందని రాజగోపాల్‌రెడ్డి వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించినవి కావని, కేవలం ఆవేదనతో కూడినవేనని చెప్పారు. తన వ్యాఖ్యల్లో వాస్తవం ఉందో లేదో పార్టీ సీనియర్లు గుండెలపై చేయి వేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు.

స్వార్ధ ప్రయోజనాల కోసం కొందరు రాహుల్‌ గాంధీని తప్పుదోవ పట్టించారని, కమిటీలు ఇష్టారీతిగా నియమించారని ఆరోపించారు. ఎన్నికల కమిటీలో 41 మంది ఏమిటని, అంత మంది ఉంటే వారు కొట్టుకోవడానికే సరిపోతుందన్నారు. ఇప్పటికైనా కమిటీని 9 మందికి కుదించాలని స్పష్టం చేశారు. ఎన్నికల హామీలన్నీ ఉత్తమ్‌ చెప్పేశాక మేనిఫెస్టో కమిటీ ఎందుకని ప్రశ్నించారు. రూ. 2 లక్షల చొప్పున రుణ మాఫీ, అందరికీ సన్న బియ్యం, ఉద్యోగాలు, పింఛన్లు పెంపు తదితర హామీలను ప్రకటించాక మెనిఫెస్టో కమిటీ ఏం చేస్తుందని నిలదీశారు.