సాధ్విప్రజ్ఞా సింగ్  పై బీజేపీ క్రమశిక్షణా చర్య  

జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడంటూ బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో బీజేపీ క్రమశిక్షణా చర్యలకు దిగింది. 

పార్లమెంటరీ పార్టీ సమావేశాల్లో పాల్గొనకుండా ఆమెపై వేటు వేసింది. ఢిఫెన్స్ ప్యానల్ నుంచి కూడా ఆమెను తొలగించింది. ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కానీయకుండా చూసుకోవాలంటూ హెచ్చరికలు చేసింది.

సాధ్వి వ్యాఖ్యలను తమ పార్టీ ఖండిస్తున్నట్టు బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా స్పష్టం చేశారు. ఇలాటి వ్యాఖ్యలకు తమ పార్టీ ఎప్పుడూ మద్దతీయదని తేల్చి చెప్పారు. 

కాగా, బీజేపీ క్రమశిక్షణా కమిటీ నుంచి కూడా సాధ్విని బహిష్కరించే అవకాశాలు ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపారు. గత లోక్‌సభ భోపాల్ నియోజవర్గం నుంచి ఎంపీగా సాధ్వి గెలిచారు. మహాత్మాగాంధీ హంతకుడైన గాడ్సేను దేశభక్తుడంటూ గతంలోనూ వ్యాఖ్యానించి ఆమె తీవ్ర వివర్శలు ఎదుర్కొన్నారు.

బుధవారం లోక్‌సభలో ఎస్‌పీజీ బిల్లుపై చర్చ సందర్భంగా డీఎంకే ఎంపీ ఎ.రాజా చర్చలో పాల్గొంటూ గాంధీ హంతుకుడైన గాడ్సే పేరు ప్రస్తావించినప్పుడు సాధ్వీ అడ్డుకున్నారు. 'ఒక దేశభక్తుడిని ఉదాహరణగా చెప్పడం ఏమిటి?' అంటూ నిలదీయడంతో విపక్ష సభ్యులు మూకుమ్మడిగా నిరసన తెలిపారు. 

సాధ్వికి బీజేపీ ఎంపీలు నచ్చజెప్పి సీట్లో కూర్చోవాలని కోరడం సభలో చోటుచేసుకుంది. దీంతో రాజా వ్యాఖ్యలు మాత్రమే రికార్డుల్లో చేరుస్తామని స్పీకర్ ఓం బిర్లా సభలో ప్రకటించారు