నేడే సాయంత్రం ఉద్ధవ్‌ ఠాక్రే ప్రమాణస్వీకారం 

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్‌ రాజీనామా చేసిన కొద్ది గంటలకే మంగళవారం సాయంత్రం ఒక హోటల్‌లో సమావేశమైన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు ఉద్ధవ్‌ ఠాక్రేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

అనంతరం రాత్రి పది గంటల సమయంలో ఉద్ధవ్‌ సారథ్యంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ నేతలు గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరారు. నిబంధనల ప్రకారం.. తమకు మద్దతునిస్తున్న మూడు పార్టీల ఎమ్మెల్యేల జాబితాను సమర్పిస్తామని గవర్నర్‌కు చెప్పారు. 

ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం 6.40 గంటలకు తన తండ్రి సమాధి ఉన్న ముంబైలోని ప్రఖ్యాత శివాజీ పార్కులో అట్టహాసంగా జరిగే కార్యక్రమంలో ఉద్ధవ్‌ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా సహా పలువురు రాజకీయపార్టీల అధ్యక్షులను, నాయకులను, ప్రముఖులను ఆహ్వానించనున్నట్టు శివసేన తెలిపింది. 

కాంగ్రెస్‌కు చెందిన బాలాసాహెబ్‌ థోరట్‌, ఎన్సీపీ నాయకుడు జయంత్‌ పాటిల్‌ ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.  ఈ ప్రకటన వెలువడిన వెంటనే శివసైనికులు పటాకాలు కాలుస్తూ సంబురాలు చేసుకున్నారు. ఉద్ధవ్‌ ప్రమాణ కార్యక్రమాన్ని తొలుత డిసెంబర్‌ ఒకటిన నిర్వహించాలని తలపెట్టినప్పటికీ దానిని ముందుకు జరిపారు. 

కొద్ది రోజులుగా హోటళ్లు, రిసార్ట్‌లలో గడిపిన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు వెళ్లాల్సి ఉన్నందున ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గురువారమే నిర్వహించాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్‌ నేత థోరట్‌ తెలిపారు. ఉద్ధవ్‌ ఠాక్రే పేరును ఎన్సీపీ నాయకుడు జయంత్‌ పాటిల్‌ ప్రతిపాదించగా, మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు బాలాసాహెబ్‌ థోరట్‌ మద్దతు తెలిపారు.  

కాగా, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానని తాను కలలో కూడా అనుకోలేదని కూటమి నేతగా ఎన్నికయన అనంతరం మాట్లాడుతూ ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు.  తాను ఎవరిపైనా ‘ప్రతీకారం’ తీర్చుకోబోనని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత ‘ఢిల్లీ వెళ్లి మా పెద్దన్న (మోదీ)ని కలుస్తా’ అని చెప్పారు. ఎన్నికల సభల్లో ఉద్ధవ్‌ను మోదీ తన తమ్ముడిగా పేర్కొన్న సంగతి తెలిసిందే. 

ఉద్వేగానికి గురైన ఉద్ధవ్‌ తన తండ్రి బాల్‌ ఠాక్రేను గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ధన్యవాదాలు తెలిపారు. ‘సోనియాజీకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాతో 30 ఏండ్లు స్నేహం చేసిన వారు మమ్మల్ని నమ్మలేదు. కానీ మేము 30 ఏండ్లు పోరాడిన వారు మాత్రం మాపై నమ్మకముంచారు’ అని చెప్పారు. సామాన్య ప్రజలు తమ ప్రభుత్వాన్ని సొంతం చేసుకోవాలని కోరారు. 

‘ఈ పోరాటం వ్యక్తిగతమైనది కాదు.. మా ప్రభుత్వం ప్రతీకారంతో పనిచేయదు. నేటి పరిణామాలన్నీ ప్రజాస్వామికంగా జరిగాయి’ అని స్పష్టం చేశారు. ‘అందరం కలిసి రైతుల కన్నీళ్లు తుడిచేద్దాం’ అన్నారు. బీజేపీని ఉద్ధవ్‌ పరోక్షంగా ప్రస్తావిస్తూ, అబద్ధాలు చెప్పే వారితో మళ్లీ కలువబోనని చెప్పారు. 

ఈ సమావేశానికి ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, ఆ పార్టీ సీనియర్ నా యకుడు ప్రఫుల్ పటేల్ కాంగ్రెస్ నాయకుడు అశోక్ చవాన్, స్వాభిమాని షేత్‌కారీ సంఘటన నేత రాజు శెట్టి, సమాజ్‌వాది నేత అబూ అజ్మీ, ఈ పార్టీలకు చెందిన ఎంఎల్‌ఎలు ఇతరులు హా జరైనారు. ఈ మూడు పార్టీలు తమ కూటమికి ‘మహారాష్ట్ర వికాస్ ఆఘాడీ’గా నామకరణం చేశాయి