పుష్కరాల ఘటనపై సిబిఐ దర్యాప్తుకు కన్నా డిమాండ్

పుష్కరాల ఘటనపై, విశాఖ భూ కుంభకోణంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  సీబీఐ విచారణ కోరాలని బిజెపి రాష్ట్ర అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ  డిమాండ్‌ చేశారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు తన ప్రచార ఆర్భాటానికి లఘు చిత్రాన్ని తీయించుకోడానికి అధిక సమయం కేటాయించడం, పుష్కరాలకు రైళ్లు, బస్సుల్లో వచ్చే యాత్రికులను ఆయన ఉన్న ఘాట్‌కే అధికారులు పంపించి, ఏ గేటూ తెరవకుండా గంటల తరబడి జనాన్ని నిలివేయడం వలన తొక్కిసలాట జరిగి 29 మంది చనిపోయారని కన్నా గుర్తు చేసారు. అయితే, ఈ పుష్కరాలకు మీడియా ఇచ్చిన ప్రాధాన్యత ఇచ్చిందని, దీంతో జనం అధిక సంఖ్యలో రావడం వలన 29 మంది మరణించారని సోమయాజులు కమిటీ నివేదిక ఇవ్వడం విడ్డురంగా ఉన్నదని ఎద్దేవా చేసారు.

ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం కనిపించడం కన్నా అభిప్రాయపడ్డారు. దేశంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని తాను అనుకోవడం లేదని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా దేశంలో, రాష్ట్రంలో అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ ఒంటరిగానే రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని చెప్పారు.

మోదీ ప్రధాని అయిన తరువాత పేదల కోసం 160 సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.  కేంద్రం ఇస్తున్న నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కార్యకర్తల ఖాతాల్లోకి జమ చేస్తున్నారని కన్నా ఆరోపించారు. ప్రధాని మోదీ దేశంలోని అన్ని రాష్ట్రాలకన్నా మన రాష్ట్రానికే నిధులు అధికంగా ఇచ్చారని తెలిపారు. ద్రం నుంచి అధిక నిధులు తీసుకుంటూనే, మోదీని బద్నామ్ చేయడానికి చంద్రబాబు 2014 జూలై నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టారని లక్ష్మీ ధ్వజమెత్తారు.

సమయానుకూలంగా కొంతమంది డ్రామా ఆర్టిస్ట్‌లను రంగంలోకి దించుకుంటూ వస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే, అందుకు మోదీయే కారణమని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని, ఒకవేళ ఆయనకు జ్వరం వచ్చినా అందుకు ప్రధానే కారణమని అంటారేమోనని కన్నా ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి చేయాల్సిన దానికన్నా అధికంగానే మేలు చేసినందువలన ఓటు అడిగే హక్కు బీజేపీకి మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేసారు.

2014లో కాంగ్రెస్ రాష్ట్రానికి శని అన్న చంద్రబాబు ఇప్పుడు అదే పార్టీతో జత కట్టడానికి ఎందుకు తహతహలాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించమని చెప్పింది చంద్రబాబు కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఏపీకి ద్రోహం చేసిన పార్టీతో చంద్రబాబు కలిసి ఎన్నికలకు వెళితే, ఇక్కడి ప్రజలు క్షమించరని హెచ్చరించారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని, ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడం వలనే, జనం ముందుకు రాలేకపోతున్నారని చెప్పారు. చంద్రబాబు తన నీడను చూసి తానే భయపడుతున్నారని కన్నా విమర్శించారు.

అనంతరం నగర శివారులో ఉన్న ఓ రిసార్టులో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాల పరిధి నాయకులతో  కన్నా భేటీ అయ్యారు. వచ్చే నెల మొదటి వారంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కన్వీనరును, ఇన్‌ఛార్జిని నియమిస్తామని ప్రకటించారు.