తనంతట తానే వైదొలగిన మహారాష్ట్ర సిఎం ఫడ్నవీస్

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్ రాజీనామా చేశారు. బలపరీక్షకు ముందే ఫడణవీస్ రాజీనామా చేయడంతో మహాడ్రామాలో బీజేపీ అంకం ముగిసిన్నట్లయింది.  ప్రమాణస్వీకారం చేసిన మూడు రోజులకే ఫడణవీస్ రాజీనామా చేశారు.

నవంబర్ 23న ముఖ్యమంత్రిగా ఫడణవీస్.. అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. డిప్యూటీ సీఎం పదవికి అజిత్ పవార్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఫడణవీస్ మీడియా సమావేశం నిర్వహించారు. 

'మహారాష్ట్ర ప్రజలు మహాయుతికే పట్టం కట్టారు. బీజేపీ సర్కార్‌కు ప్రజల ఆమోదం లభించింది. శివసేన కంటే బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చాయి. 105 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. మేం శివసేనతో కలిసి పోటీ చేశాం. మేం పోటీ చేసిన సీట్లలో 70శాతం బీజేపీ గెలుచుకుంది. . కనుక ప్రజల మద్దతు మాకే ఉంది' అని పేర్కొన్నారు. 

`శివసేన కోసం చాలా రోజులు వేచి చూశాం. కానీ వాళ్ల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మాతో మాట్లాడకుండా కాంగ్రెస్-ఎన్సీపీలను సంప్రదించింది. రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు నా రాజీనామా లేఖ సమర్పిస్తా. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా వారికి నా శుభాకాంక్షలు తెలుపుతున్నా. కాకపోతే అలాంటి అస్థిర ప్రభుత్వం ఎంతోకాలం కొనసాగదని' ఫడణవీస్ స్పష్టం చేశారు.

'శివసేన చెబుతున్నట్లు వాళ్లకు మేము ఎలాంటి హామీ ఇవ్వలేదు. శివసేన మోసం చేసింది. గవర్నర్ మమ్మల్ని ముందు పిలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు. సంఖ్యా బలం లేకపోవడం వల్ల మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని చెప్పాం. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన, ఎన్సీపీని కూడా గవర్నర్ పిలిచారు. వాళ్లు కూడా వెనక్కి తగ్గడంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. అజిత్ పవార్ ఇచ్చిన మద్దతు లేఖతో మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం' అని వివరించారు. 

`ఇప్పుడు విభిన్న భావజాలం కలిగిన మూడు పార్టీలు ఒక్కటయ్యాయి. కనీస ఉమ్మడి ప్రణాళిక పేరుతో అధికారం కోసం ఒకటయ్యారు. అజిత్ పవార్ వెళ్లిపోయాక సంఖ్యాబలం లేదని అర్థమైపోయింది. ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తా. వేరే పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టబోం. బాధ్యతాయుత ప్రతిపక్ష పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నట్లు' ఫడణవీస్ ప్రకటించారు.