ఓటుబ్యాంకు రాజకీయాలకే  పెండింగ్ లో కీలక అంశాలు 

అయోధ్య, 370 ఆర్టికల్‌ రద్దు లాంటి కీలక అంశాలను కాంగ్రెస్ పెండింగ్‌లో ఉంచిందని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఇంతటి కీలకమైన సమస్యలను 70 ఏళ్లుగా నాన్చుతూ వచ్చిందని మండిపడ్డారు. 

జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ మాట్లాడుతూ... కీలకమైన అంశాలకు పరిష్కారం చూపకుండా నాన్చే అలవాటు కాంగ్రెస్ పార్టీదని, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగానే వాటికి పరిష్కారం చూపలేదని ఆయన ఆరోపించారు. 

కీలకమైన సమస్యలకు పరిష్కారం చూపుతామని తాము ఎన్నికల ముందే హామీ ఇచ్చామని, ఇచ్చిన రీతిలోనే తాము వాటికి పరిష్కారం చూపించామని ఆయన తెలిపారు. దేశాన్ని ఐక్యంగా ఉంచడంతో పాటు బలమైన భారత్ కోసం బీజేపీ పనిచేస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న అయోధ్య సమస్యకు పరిష్కారం చూపి, ప్రజలను సంతోషపెట్టామని ప్రకటించారు. 

జార్ఖండ్‌లో బలమైన, స్థిరమైన ప్రభుత్వం నెలకొనాల్సిన అవసరం ఉందని చెబుతూ గత ఐదేళ్లుగా బలమైన ప్రభుత్వమే పాలించిందని, మరో ఐదేళ్లూ ఇలాగే కొనసాగాలని ప్రధాని ఆకాంక్షించారు. సుస్థిరత, సుపరిపాలన, అభివృద్ధి, ఆత్మగౌరవం, జాతీయ భద్రత అనే అంశాల ప్రాతిపదికపై బిజెపి రాష్ట్రాలలో పాలిస్తున్నదని ప్రధాని తెలిపారు. 

రాష్ట్రంలోని ప్రతిపక్షాలు కేవలం అధికారం కైవసం చేసుకోవడానికే కూటమిగా ఏర్పడ్డాయని ధ్వజమెత్త్తుతూ ఒకవేళ ప్రతిపక్ష కూటమి రాష్ట్రంలో తిరిగి అధికారమలోకి వస్తే రాజకీయ అస్థిరత ఏర్పడుతుందని ప్రధాని హెచ్చరించారు.