ఉప ఎన్నికల్లో 15 సీట్లపై బిజెపి ధీమా 

తమ రాష్ట్రంలో 15 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ధీమా వ్యక్తం చేశారు. 

బీజేపీ అభ్యర్థుల విజయం కోసం చేస్తున్న ప్రచారంలో భాగంగా ఆదివారం ఉత్తర కన్నడ జిల్లాలోని బనవాసిలో జరిగిన భారీ ఊరేగింపునుద్ధేశించి యడియూరప్ప ప్రసంగిస్తూ  ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని యడియూరప్ప ధీమాగా చెప్పారు. 

కాంగ్రెస్ అభ్యర్థులు సమీపంలో కూడా ఉండరని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. వచ్చే మూడున్నరేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమాలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. 

కాగా, ప్రతి ఎన్నికల్లోనూ వీరశైవులు బీజేపీతోనే ఉన్నారని ప్రస్తుత ఉపసమరంలోనూ 15 మందికి మద్దతు ఇస్తారని సీఎం యడియూరప్ప ధీమా వ్యక్తం చేశారు. బెళగావిలో ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చిన సీఎం మీడియాతో మాట్లాడుతూ వీరశైవ లింగాయత సామాజికవర్గమంతా బీజేపీతో నే ఉంటారని భరోసా వ్యక్తం చేశారు.

చిన్నా చితకా సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించుకుంటామని చెప్పారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌ నాయకులు ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని స్పష్టం చేశారు.