మధ్యప్రదేశ్ మాజీ సీఎం కైలాష్ జోషి కన్నుమూత  

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత కైలాష్ జోషి కన్నుమూశారు. ఆయన వయస్సు 90 ఏళ్లు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. బన్సాల్ హాస్పిటల్ చికిత్సపొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. శ్వాస సంబంధిత, మధుమేహంతో జోషి బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. 

ఆయనకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కొద్దీ నెలల క్రితమే ఆయన భార్య మృతి చెందారు. అంత్యక్రియలు సోమవారం సాయంత్రం ఆయన స్వగ్రామమైన దేవాస్ జిల్లాలోని హత్పిపాల్యాలో జరగనున్నాయని బీజేపీ వర్గాలు తెలిపాయి.

`రాజకీయాలలో ఋషి'గా భావించే ఆయన 1929 జులై 14న జన్మించారు. 1977 నుండి 1978 వరకు జనతా పార్టీ హయాంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎనిమిదిసార్లు ఎమ్యెలేగా ఎన్నికైన ఆయన లోక్ సభ, రాజ్యసభ లలో కూడా సభ్యునిగా పనిచేశారు. 2004 నుండి 2014 వరకు భోపాల్ నుండి లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. 

జోషి మృతి పట్ల ప్రధాని మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ నేతలు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

మధ్యప్రదేశ్‌లో బీజేపీని పటిష్టం చేసిన వారిలో జోషి ఒకరంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. పార్టీ ఎదుగుదలలో ఆయన భాగస్వామ్యం మరవలేనిదని వ్యాఖ్యానించారు.