బిజెపికి కలిసి వచ్చిన పవార్ కుటుంభం విబేధాలు 

మహారాష్ట్రలో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్ కుటుంబంలో ఎప్పటి నుంచో నెలకొన్న విభేదాలను సొమ్ము చేసుకోవడంలో భారతీయ జనతాపార్టీ (బీజేపీ) అధినాయకత్వం విజయం సాధించింది. పవార్‌పై అసంతృప్తి చాన్నాళ్ల నుంచి చాపకింద నీరులా ఉంటూ వచ్చింది. మహారాష్టల్రో శివసేనతో బీజేపీకి సంబంధాలు బెడిసికొట్టడం, ఎన్‌సీపీ-కాంగ్రెస్‌తో కలిసి సేన అధినేత ఉద్ధవ్ థాక్రే పావులు కదపడం జరిగింది. 

ఈ నేపథ్యంలో బీజేపీ రాజకీయ చతురత ప్రదర్శించింది. శుక్రవారం రాత్రికి రాత్రే పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోడానికి వ్యూహరచన చేసింది. శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ వారం రోజుల పాటు చేసిన ప్రయత్నాలన్నింటినీ వమ్ముచేసింది. శరద్ పవార్ మేనల్లుడు అజిత పవార్‌ను ఎన్‌సీపీ నుంచి బయటకు లాగి బీజేపీ హైకమాండ్ తన పని విజయవంతంగా ముగించింది. 

అనూహ్యంగా శనివారం ఉదయం 7 గంటలకు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేశారు. ఆ విధంగా ‘బీ’ ప్లాన్ వర్కవుట్ అయింది. శుక్రవారం రోజంతా శివసేన-ఎన్‌సీపీ-కాంగ్రెస్ సుదీర్ఘంగా చర్చించి ప్రభుత్వం ఏర్పాటుకు సన్నద్ధమయ్యాయి. ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి కూటమి రెడీ అయిపోయింది. 

శనివారం గవర్నర్‌ను మరోసారి కలవాలని నిర్ణయించుకున్నారు. ముంబయిలోని నెహ్రూ సెంటర్‌లో సాయంత్రం జరిగిన మూడు పార్టీల నేతల సమావేశానికి అజిత్ పవార్ హాజరయ్యారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మల్లిఖార్జున ఖర్గే  తెలిపారు. రాత్రి తొమ్మిది తరువాత అజిత్ ఉన్నట్టుండి అదృశ్యమయ్యారని ఎన్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. శివసేన ఊహించినట్టు పరిస్థితులు యథావిధిగా ఉంటే ఉద్ధవ్‌కు అవకాశం వచ్చి ఉండేది. 

ఇక్కడే బీజేపీ తన రాజకీయ చతురతను ప్రదర్శించి విజయవంతమైంది. ఈనెల 12న విధించిన రాష్ట్రపతి పాలనను అనూహ్యంగా శనివారం తెల్లవారుజామున 5.47కు తొలగించారు. దేవేంద్ర ఫడ్నవీస్ మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. గవర్నర్ ఉదయం 7.30కు నిరాడంబరంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఈ తతంగం ముగించారు. ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం వార్తపై రాజకీయంగా కలకలం రేపింది. 

శరద్ పవార్, ప్రఫుల్ పటేల్‌పై ఇప్పటికే ఈడీ కేసులు ఉన్నందున వాటిని చూపించి అజిత్ పవార్‌ను బీజేపీ భయపెట్టిందని ఓ కాంగ్రెస్ నేత ఆరోపించారు. శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలేకు అజిత్ పవార్‌కు మధ్య ఉన్న విభేదాలు కమలనాథులకు కలిసివచ్చింది. లోక్‌సభ, అసెంబ్లీ సీట్ల కేటాయింపువ్యవహారంలో సూలే, అజిత్ మధ్య గొడవలు మొదలయ్యాయని అంటున్నారు. 

తాను ఈడీ ఆఫీసుకు వెళ్లేసమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్‌సీపీ కార్యకర్తలను తరలించాలని శరద్ పవార్ భావిస్తే అజిత్ పవార్ నుంచి సరైన స్పందన కనిపించలేదు. ఉద్దేశపూర్వకంగానే ఆయన గైర్హాజరైనట్టు భావిస్తున్నారు. ఆ రోజు సాయంత్రమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మర్నాడు విలేఖరులతో మాట్లాడుతూ మహారాష్ట్ర స్టేట్ కోపరేటివ్ బ్యాంకు కుంభకోణం కేసులో తన పేరు, శరద్ పవార్ పేరును ఇరికించడం బాధించిందని అజిత్ చెప్పుకొచ్చారు. 

ఒకటి కాదు అనేక సందర్భాల్లో ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తునే ఉన్నారు. తరువాత శరద్ పవార్ నివాసం సిల్వర్ ఓక్‌లో జరిగిన ఎన్‌సీపీ భేటీకి అజిత్ గైర్హాజరయారు. తాను బారామతిలో ఉండిపోయినందున సమావేశానికి రాలేకపోయానని ఆయన సంజాయిషీ ఇచ్చుకున్నారు. తన కుమారుడు పార్థ్‌కు మావల్ లోక్‌సభ సీటు నిరాకరించారన్న ఆగ్రహంతో ఎన్‌సీపీ అధినేతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 

చివరికి పార్థ్‌కు సీటు దక్కినా ఓటమి పాలయ్యాడు. కాగా శరద్ పవార్ మరో సోదరుడి మనుమడు రోహిత్ పవార్ ఎన్‌సీపీలో నాయకుడిగా ఎదగడం అజిత్‌కు నచ్చలేదు. రోహిత్ కర్జాట్-జాంఖెడ్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి గెలవడంతో అజిత్ పవార్‌లో అభద్రతా భావం పెరిగిపోయింది. పవార్ కుటుంబంలోని విభేదాలు బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకుందని మరో కాంగ్రెస్ నేత వెల్లడించారు.