ముంబాయి బాటలో 20 మంది కర్ణాటక ఎమ్యెల్యేలు

అసమ్మతి నేతలతో సమాలోచనలు జరిపి తమ ప్రభుత్వానికి ఇక ముప్పు లేదని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య భరోసా వ్యక్తం చేసిన 24 గంటలు కూడా గడవక అముందే సంకీర్ణ ప్రభత్వం ఆపదలో పడింది. కనీసం 20 మంది కాంగ్రెస్ ఎమ్యెల్యేలు ముంబైకి ప్రయాణం అవుతున్నట్లు వచ్చిన కధనాలు సంకీర్ణ ప్రభుత్వ నేతలను కలవర పరుస్తున్నాయి. 

అసమ్మతి ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా ముంబై వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వీరికి పూర్తి భద్రత కల్పించే బాధ్యతను మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌ తన మంత్రి చంద్రకాంత్‌ పాటిల్‌కు అప్పగించారు. తిరుగుబాటులో జార్కిహోళి సోదరులతో పాటు హొసకోట ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజు, చిక్కబళ్లాపురం ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాకర్‌ కీలక భూమిక పోషిస్తున్నట్లు సమాచారం. ముంబై వెళ్లి బీజేపీ అగ్రనేతలతో సమగ్ర చర్చలు ముగిశాక వీరు కీలక నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు.  

 నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్ లోనే ఉంటామని ప్రకటించిన మంత్రి రమేశ్‌, సుధాకర్‌.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌, జేడీఎస్‌ నాయకులకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అసమ్మతి ఎమ్మెల్యేల్లో శ్రీమంత పాటిల్‌, మహంతేశ్‌ కమటహళ్లి, ఆనంద్‌సింగ్‌, నాగేంద్ర, గణేశ్‌, భీమానాయక్‌, రాజా వెంకటప్ప నాయక్‌, బి.సత్యనారాయణ, బీసీ పాటిల్‌, బీకే సంగమేశ్‌, నాగేంద్ర, ఆర్‌.శంకర్‌ కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. 

ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ పదేపదే ప్రయత్నిస్తోందని కుమారస్వామి విరుచుకుపడ్డారు. ఆ పార్టీపై ప్రజలు తిరగబడాలని హాసన్‌ జిల్లా బహిరంగ సభలో పిలుపిచ్చారు. అసమ్మతి ఎమ్మెల్యేలను తరలించేందుకు బీజేపీ మిలిటరీ విమానాలను ఉపయోగిస్తోందని ఆరోపించారు. కుమారస్వామి వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ సమాజంలో హింసను ప్రేరేపించేలా పిలుపివ్వడం దేశద్రోహం కిందకు వస్తుందని బీజేపీ సీనియర్‌ నేత ఆర్‌.అశోక్‌ వ్యాఖ్యానించారు.

అయితే తమ సంకీర్ణంకు చెందిన ఎమ్యెల్యేలు అందరిని గవర్నర్ వద్దకు తీసుకెళ్లి బల ప్రదర్శన జరపడం కోసం సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్ కు చెందిన ఉప ముఖ్యమంత్రి జె పరసమేశ్వరన్ తెలిపారు. తమ ఎమ్యెల్యేలను భారీ ప్రలోభాలు చూపు ఆకట్టుకొనే ప్రయత్నం బిజెపి చేస్తున్నట్లు సిద్దరామయ్య ఆరోపించారు. 

మంత్రి డి.కె.శివకుమార్‌పై ఈడీ కేసులు నమోదు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు బెంగళూరులోని మాజీ సీఎం యడ్యూరప్ప నివాసాన్ని ముట్టడించారు. అక్కడ ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు రేణుకాచార్య, విశ్వనాథ్‌లతో ఘర్షణ పడ్డారు. పోలీసులు సకాలంలో జోక్యం చేసుకుని కార్యకర్తలను అక్కడి నుంచి పంపేశారు. కుమారస్వామి ప్రోద్బలంతోనే యడ్యూరప్ప నివాసంపై దాడికి ప్రయత్నించారని రేణుకాచార్య ఆరోపించారు.