ఇక శివసేన మౌనంగా ఉంటే మంచిది 

ఇక శివసేన మౌనంగా ఉంటే మంచిదంటూ బిజెపి హితవు పలికింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణం చేసిన కొద్దిసేపటికే... శివసేన నేత సంజయ్ రావత్‌పై బీజేపీ రాష్ట్ర చీఫ్ చంద్రకాంత్ పాటిల్ నిప్పులు చెరిగారు.

‘‘సంజయ్ రావత్ ఇకనైనా మౌనంగా ఉంటే మంచిది. ఆయన శివసేనను నాశనం చేశాడు. బీజేపీ-శివసేన కలిసి పోటీచేస్తే ప్రజలు 161 సీట్లు కట్టబెట్టారు. కానీ శివసేన ప్రజాతీర్పునకు ద్రోహం చేసింది. తొలి మీడియా సమావేశం నుంచే వాళ్లు ప్రత్యామ్నాయం అంటూ మాట్లాడడం మొదలు పెట్టారు..’’ అని పాటిల్ పేర్కొన్నారు.

శివసేన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రావత్.. బీజేపీపై గత రెండు వారాలుగా తీవ్రస్థాయిలో విమర్శలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యేకించి సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ అధికారం కోసం అర్రులు చాస్తున్నారంటూ వ్యక్తిగతంగానూ ఆయన విమర్శలు చేశారు. 

కాగా తమకు మొత్తం 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందనీ.. మహారాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకుంటామని బీజేపీ నేత గిరీశ్ మహాజన్ పేర్కొన్నారు.  ఇలా ఉండగా, సంజయ్ రావత్ చేస్తున్న రెచ్చగొట్టే వాఖ్యలే బిజెపి-శివసేనల మధ్య దూరం పెంచినట్లు పలువురు శివసేన నేతలు సహితం విమర్శిస్తున్నారు.