శివసేనకు షాక్... సీఎంగా ఫడ్నవిస్

మహారాష్ట్రలో నెలరోజులకు పైగా సాగుతున్న రాజకీయ హైడ్రామా ఇవాళ ఊహించని మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి పదవి కోసం ప్రత్యర్థి పార్టీలతో జత కట్టిన శివసేనకు బీజేపీ భారీ షాక్ ఇచ్చింది. మరికొద్ది గంటల్లో శివసేన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందనగా... ఏకంగా ఆ పార్టీ చేతులు కలిపిన ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. 

ఆగమేఘాల మీద శనివారం ఉదయం దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రిగా ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ ప్రమాణం చేశారు. వీళ్లిద్దరూ ప్రమాణం స్వీకారం చేసిన కొద్ది క్షణాలకే ప్రధాని నరేంద్రమోదీ స్పందిస్తూ అభినందనలు తెలపడం గమనార్హం.  ‘‘మహారాష్ట్ర భవిష్యత్తు కోసం వారు కష్టించి పనిచేస్తారన్న నమ్ముతున్నాను..’’ అంటూ మోదీ ట్వీట్ చేశారు.

కాగా ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అజిత్ పవర్ స్వయానా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మేనల్లుడు కావడం విశేషం. శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేకు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించేందుకు ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందంటూ.. నిన్న ఈ మూడు పార్టీల భేటీ తర్వాత శరద్ పవార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

కాగా బీజేపీతో చేతులు కలపాలన్నది తన సొంత నిర్ణయమేనని అజిత్ పేర్కొన్నారు. మరోవైపు ఫడ్నవిస్ స్పందిస్తూ... మహారాష్ట్రకు ‘‘కిచిడీ సర్కారు’’ అక్కర్లేదనీ... సుస్థిర ప్రభుత్వమే కావాలని వ్యాఖ్యానించారు. మ‌హారాష్ట్ర ప్ర‌జ‌ల కోసం తాను సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ట్లు చెప్పారు. 

ప్ర‌జ‌లు తమకు స్ప‌ష్ట‌మైన మెజారిటీని ఇచ్చార‌ని, కానీ ఫ‌లితాల త‌ర్వాత ఇత‌ర పార్టీల‌తో పొత్తు పెట్టుకునేందుకు శివ‌సేన ప్ర‌య‌త్నించింద‌ని ఆరోపించారు. దాని వ‌ల్లే రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించామ‌ని పేర్కొన్నారు. 

బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 41 మంది ఎంఎల్ఎల మద్దతు అవసరం ఉందని చెబుతూ దీంతో 54 మంది ఎంఎల్ఎలు ఉన్న ఎన్ సిపి తనకు మద్దతు తెలపడంతో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని ఫడ్నవీస్ తెలిపారు.   

మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడాక ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో తీవ్ర జాప్యం జరిగిందని, భారీవర్షాల వల్ల పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని అందువల్లే తాము బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని అజిత్ పవార్ చెప్పారు.  

ఉద్దవ్ థాకరే సీఎం అవుతార‌ని శుక్ర‌వారం ఎన్సీపీ కూట‌మి ప్ర‌క‌టించినా రాత్రికి రాత్రే ఊహించ‌న ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి.