ఆర్టీసీ ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌  

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ప్రైవేటీకరణపై దాఖలైన రిట్‌ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. దీంతో ప్రభుత్వ విధానాలకు లైన్‌క్లీయర్ అయింది. గతంలో ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపట్టిన కోర్టు.. ఇవాళ వాదప్రతివాదనలు విన్న తర్వాత ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. 

5100 బస్సుల ప్రైవేటీకరణపై ఏజీ వాదనలు వినిపించారు. ప్రభుత్వ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. కేబినెట్‌ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమంటూ న్యాయస్థానం తేల్చిచెప్పింది. మోటార్‌ వెహికల్‌ యాక్ట్‌ 102 ప్రకారం.. ప్రభుత్వానికి విశేష అధికారాలున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వ పాలసీ విధానాలలో పిటిషనర్ల జోక్యం తగదని ఏజీ స్పష్టం చేశారు. 

ఈ సందర్భంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను ఏజీ ప్రస్తావించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేస్తామని పిటిషనర్‌ తరపు లాయర్‌ పేర్కొన్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠ నెలకొంది. 

నిన్న ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించినా.. శుక్రవారం తీర్పు నేపథ్యంలో ఆయన ఏ నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ఆర్టీసీపై కేబినెట్ నిర్ణయాన్ని సమర్థిస్తూ న్యాయస్థానం సానుకూల తీర్పునిచ్చిన తరుణంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటోందనన్న ఆసక్తి నెలకొంది. 

దాదాపు రెండు నెలలుగా ఆందోళన చేస్తున్న ఆర్టీసీ కార్మికుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఓ వైపు ఆందోళనలను విరమించి తిరిగి ఉద్యోగాల్లో చేరతాలేదు. కార్మికులను తిరిగి చేర్చుకుంటారా? లేక షరతులు విధిస్తారా? అన్న దానిపై వేచిచూడాలి.