బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు బ్రేకులు!

మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్ కూటమి అధికారాన్ని చేపడితే ప్రధాని నరేంద్ర మోడీ మానస పుత్రిక బుల్లెట్ ట్రైన్‌కు బ్రేకులు పడే అవకాశం కనిపిస్తున్నది. గుజరాత్‌లోని అహ్మదాబాద్-ముంబై మధ్య ఈ బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేయాలన్నది ప్రధాని మోడీ సంకల్పలించడం తెలిసిందే. 

అయితే, తమ కూటమి ప్రభుత్వం ఏర్పడితే భారతదేశంలో నిర్మించ తలపెట్టిన మొదటి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును రద్దు చేసి, ఇందులో మహారాష్ట్ర ప్రభుత్వ వాటా రూ. 1 లక్ష కోట్లను నిలిపివేయాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

ప్రధాని మోడీ, జపాను ప్రధాని షింజో అబె 2017 సెప్టెంబర్‌లో అహ్మదాబాద్‌లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 0.1 శాతం వడ్డీపై జపాను రూ. 88,000 కోట్లను ఈ ప్రాజెక్టు కోసం రుణంగా అందచేస్తోంది. ఈ ప్రాజెక్టును కొనసాగించదలిస్తే కేంద్ర ప్రభుత్వమే ఖర్చంతా భరించాలని, ఈ ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర ఒక్క పైసా పెట్టబోదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకడు ఒకరు స్పష్టం చేశారు. 

తమ కూటమి ప్రభుత్వం ఏర్పడితే రైతుల సంక్షేమ పథకాలు, రైతులకు రుణ మాఫీ అమలు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు.