బెంగాల్ నుండి మమత ప్రభుత్వాన్ని తరిమివేయండి

పచ్చిమ బెంగాల్ నుండి మమతా బెనర్జీని తరిమి వేయాలని బిజెపి అద్యక్షుడు అమిత్ షా పిలుపిచ్చారు. అందుకోసమే తాను ఇక్కడ పర్యటనకు వచ్చానని అంటూ ఆమె ప్రభుత్వాన్ని సాగనంపే వరకు ప్రతి జిల్లాల్లో పర్యటిస్తూ ఉంటానని కొలకత్తాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ స్పష్టం చేసారు.

“పశ్చిమ్‌బంగా ప్రజలకు మేం విరోధులం కాదు. కేవలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే మా శత్రువు. తృణమూల్‌ కాంగ్రెస్‌ మీద పోరాటం చేయడానికే ఇక్కడ నేనున్నాను. పశ్చిమ్‌ బంగా ప్రజలపై భాజపాకు ఎలాంటి ద్వేషం లేదు” అని ప్రకటించారు. బిజెపి  భాజపా వ్యవస్థాపకుడు శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ సొంత గడ్డ అయిన ఈ రాష్ట్రంపై తమ కెందుకు వైరం ఉంటుంది? అని ప్రశ్నించారు.

అక్రమ వలసదారులను ఏరిపారేయడానికి ఎన్‌ఆర్‌సీ ఎంత బాగా ఉపయోగపడిందో మమతకు అర్ధం కావడం లేదని అంటూ బిజెపిని ఆమె ఎంతగా విమర్శించినా ఎన్‌ఆర్‌సీ విధానం మాత్రం ఆగదని ప్రకటించారు. దీనిని వ్యతిరేకించడం ద్వారా అక్రమ వలసదారులను ఆమె ప్రోత్సహిస్తున్నట్లు అవుతున్నదని అంటూ ఇదే తమ విధానమని ఆమె పార్టీ చెప్పగలదా అని సవాల్ చేసారు. గతంలో కమ్యూనిస్ట్ లు అక్రమ వలసదారుల మద్దతుతో రాజ్యమేలారని అంటూ ఇప్పుడు ఆ పని మమత చేస్తున్నారని ఎద్దేవా చేసారు.

కేవలం ఓటే బ్యాంకు రాజకీయాల కోసమే అక్రమ వలసదారులకు మమత బనేర్జి, రాహుల్ గాంధీ మద్దతు ఇస్తున్నారని అంటూ ఓట్ల కోసం ఆమె ఇతర దేశాల నుంచి కూడా ఓటర్లను తెప్పించుకోగలరని మండిపడ్డారు. రోహింగ్యాలు, బంగ్లాదేశ్‌ నుంచి వచ్చి ఇక్కడ తలదాచుకుంటున్న అక్రమ ప్రవేశదారులపై బిజెపి ద్రుష్టి సారించినదని స్పష్టం చేస్తూ కేంద్రం నుంచి పశ్చిమ్‌ బంగాకు రూ.కోట్ల నిధులు వచ్చినప్పటికీ వాటన్నింటినీ మమత ప్రభుత్వం దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

తన ప్రసంగం రాష్ట్ర ప్రజలు వినకుండా చేయడం కోసం కేబుల్ టివి లపై ఆంక్షలు విధించారని ఆరోపిస్తూ ఆ విధంగా తమ స్వరాన్ని అడ్డుకోలేరని హెచ్చరించారు. బిజెపి కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలకు మమత అవకాశవాద రాజకీయాలను వివరిస్తారని స్పష్టం చేసారు.