ఆర్టీసీ ప్రైవేటీకరణకే తెలంగాణ ప్రభుత్వ మొగ్గు

ప్రభుత్వరంగంలో ఆర్‌టిసిని నిర్వహించడం భవిష్యత్‌లో ఎటువంటి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని తెలంగాణ ప్రభుత్వం తేల్చేసింది. ముఖ్యమంత్రి కెసిఆర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్‌టిసి భవిష్యత్‌పై సుదీర్ఘంగా చర్చించారు. సమ్మె విరమించడానికి సిద్ధంగా ఉన్నామని, షరతులు లేకుండా తమను విధుల్లోకి తీసుకోవాలంటూ ఆర్‌టిసి జెఎసి విజ్ఞప్తి చేసిన అనంతరం ఈ సమావేశం జరగడంతో ఎటువంటి నిర్ణయం వెలువడుతుందన్న ఆసక్తి రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది.

సుదీర్ఘంగా దాదాపు ఐదు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో కార్మికులకు సంబంధించి జరిగిన చర్చ నామమాత్రమేనని తెలిసింది. మధ్యాహ్నం 4.30 గంటలకు ప్రారంభమై, రాత్రి 9.40 గంటల వరకు భేటీ జరగగా కార్మికులను ఉద్యోగాల్లోకి తిరిగి తీసుకునే అంశంపై ఎటువంటి స్పష్టత రాలేదు. 

దీనిపై ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఎటూ తేల్చలేదని, రూట్ల ప్రైవేటీకరణకు సంబందించి శుక్రవారం హైకోర్టు తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో, ఆ తీర్పునూ పరిశీలించిన తరువాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నట్లు సమాచారం.

ఆర్‌టిసి నిర్వహణ సంస్థకు, ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారిందని, కార్మికుల జీతాలు, పిఎఫ్‌ చెల్లింపు, బస్సుల నిర్వహణకు కలిపి నెలకు రూ.640కోట్లు ఖర్చవుతుందని, ఈ మొత్తాన్ని భరించే స్థితిలో టిఎస్‌ ఆర్‌టిసి లేదని ప్రభుత్వం పేర్కొంది. ఈ పరిస్థితుల్లో రూట్ల ప్రయివేటైజేషన్‌ ఒక్కటే ఉత్తమమని అభిప్రాయపడింది.

ఆర్‌టిసికి ఇప్పటికే రూ.5 వేల కోట్లకు పైగా అప్పులున్నాయి. తక్షణం చెల్లించాల్సిన అప్పులు, బకాయిలు దాదాపు రూ.2 వేల కోట్ల వరకు ఉన్నాయి. ప్రావిడెంట్‌ ఫండ్‌ అధికారుల ఆదేశం మేరకు ఉద్యోగులకు సెప్టెంబర్‌ మాసానికి సంబంధించి మొత్తం జీతం చెల్లించాలంటే రూ.240 కోట్లు కావాలి. సిసిఎస్‌కు రూ.500 కోట్లు ఇవ్వాలి. డీజిల్‌ బకాయిలు చెల్లించాలి. రెండేళ్లుగా రవాణా పన్ను బకాయి ఉన్నది. 

2,600 కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనాలి. పిఎఫ్‌ బకాయిల కింద నెలకు దాదాపు రూ.65-70 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా ఆర్‌టిసి ఇప్పుడున్నట్లు నడవాలంటే నెలకు రూ.640 కోట్లు కావాలి. ఈభారం భరించే శక్తి ఆర్‌టిసికి లేదు. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభుత్వం కూడా భరించే పరిస్థితి లేదు. 

చార్జీలు పెంచితే ప్రజలు బస్సులు ఎక్కని పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితులన్నీ పరిగణలోకి తీసుకుంటే ఆర్‌టిసిని యథావిధిగా నడపడం సాధ్యం కాదన్న అభి ప్రాయం సమావేశంలో వ్యక్తమయింది. సిఎం కెసిఆర్‌ కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించారు.