గడ్కరీ ఫోన్ కు స్పందించని కేసీఆర్ 

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడడానికి కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రయత్నించారు. గురువారం మధ్యాహ్నం 2-3 గంటల మధ్య దాదాపు 45 నిమిషాలపాటు కేసీఆర్‌తో ఫోనులో మాట్లాడడానికి ప్రయత్నించారు. 

కానీ, ఆయన అందుబాటులోకి రాలేదు. దాంతో, మాట్లాడాల్సి ఉందంటూ కేసీఆర్‌కి గడ్కరీ సందేశం పంపించారు. అయితే, గడ్కరీ ఫోన్‌ చేసిన సమయంలో సీఎం కేసీఆర్‌ ఓ మిత్రుడిని కలవడానికి నార్సింగ్‌ వెళ్లినట్లు తెలిసింది. అక్కడి నుంచి తిరిగి సాయంత్రం 4 గంటలకు వచ్చినట్లు సమాచారం.

ఇలా ఉండగా, అంతకు ముందు తెలంగాణలో ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ లోక్‌సభ సభ్యులు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాబురావు కేంద్రాన్ని కోరారు. కిషన్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. 

సమావేశానంతరం కిషన్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని గడ్కరీని కోరినట్టు వెల్లడించారు. ఆర్టీసీ అంశంలో జోక్యం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం కార్మికుల విషయంలో కక్షసాధింపువైఖరిని విడిచిపెట్టాలని సూచించారు. 

ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్మికుల కనీస డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కాగా తమ వినతిపై గడ్కరీ సానుకూలంగా స్పందించారని కిషన్‌రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తానని హామీఇచ్చినట్టు మంత్రి తెలిపారు. 

నిజామాబాద్ లోక్‌సభ సభ్యుడు ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 28 మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే అదుకోవాలని డిమాండ్ చేశారు.