రాజకీయ కక్ష సాధింపులతోనే జగన్ కాలక్షేపం  

ఆంధ్రప్రదేశ్‌లో అనాలోచిత, ప్రజావ్యతిరేక విధానాలతో రాజ్యాంగాన్నే జగన్‌ ప్రభుత్వం బ్రేక్‌ చేస్తోందన్న అనుమానం కలుగుతోందని జేఏపీ ఎంపీ సుజనా చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. పరిపాలనను పక్కనపెట్టి కేవలం రాజకీయ కక్ష సాధింపులతోనే కాలక్షేపం చేస్తోందని విమర్శించారు. 

‘రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నారు. జెరూసలేం, మక్కా వెళ్లడానికి అపారంగా నిధులు సమకూర్చుతున్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే భవిష్యత్‌లో హిందువులు కూడా.. తిరుపతి వెళ్తాం.. దేవాలయాల సందర్శనకు మాకూ నిధులివ్వండంటూ ఒత్తిడి తెస్తారు. ఈ పరిస్థితులు ఎటు దారితీస్తాయి? జగన్‌ ప్రభుత్వం ప్రాంతీయ, మత విద్వేషాలకు తెరలేపుతోందనే అనుమానమూ కలుగుతోంది’ అని ధ్వజమెత్తారు. 

రాష్ట్రంలో ఆంగ్లమాధ్యమం వద్దని ఎవ్వరు కోరడం లేదని, అయితే మాతృబాష తెలుగును చంపేయవద్దని మాత్రమే కోరుతున్నామని స్పష్టం చేశారు. ప్రాధమిక, ఉన్నత విద్య వరకు తెలుగు అధికార భాషగా ఉన్నదని గుర్తు చేస్తూ ఇప్పుడు ఆంగ్లం మద్యంగా ప్రవేశపెట్టి, తెలుగును అనుబంధంగా మార్చితే అటు ఆంగ్లం రాక, ఇటు తెలుగు రాక విద్యార్థులు రెండింటికి చెడిపోతారని హెచ్చరించారు. 

ఇంతకాలం తెలుగు భాషలో బోధనకు అలవాటు పడిన ఉపాధ్యాయులు ఇప్పుడు అర్ధాంతరంగా ఆంగ్లంలో ఎట్లా బోధిస్తారని ప్రశ్నించారు. కొద్దిపాటి శిక్షణ ఇవ్వడం వల్లన ఉపయోగం ఏమిటని నిలదీశారు. ఈ విధంగా అర్ధాంధారంగా ఆంగ్ల మాధ్యమం వైపు మొగ్గు చూపడం వెనుక మతపరమైన ప్రాధాన్యతలు ఉన్నట్లు వస్తున్న కధనాల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. 

అసలీ నిర్ణయం తీసుకునేముందు విద్యావేత్తలు, మేధావులతో సంప్రదింపులు జరిపారా అని ప్రశ్నించారు. ప్రోటోకాల్‌ మర్యాద కూడా పాటించకుండా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిపై ఏకవచనంతో జగన్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించడం ఎంతవరకు సమంజసమని సుజనా ధ్వజమెత్తారు. 

‘మైసూరులో ఉన్న తెలుగు ప్రాచీన భాషా కేంద్రాన్ని నెల్లూరుకు రప్పించడంలో వెంకయ్యనాయుడు కీలకపాత్ర పోషించారు. ఇది తెలిసీ ఆయన్ను చిన్నచూపు చూడటం మంచిది కాదు’ అని హితవు పలికారు.  

 రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ఓట్ల రాజకీయాల కోసం హద్దూ, అదుపు లేకుండా ఇష్టారాజ్యంగా అమలు చేస్తూ రాష్ట్రాన్ని  అప్పుల ఊబిలో ముంచేస్తున్నారని సుజనా ధ్వజమెత్తారు. భవిష్యత్‌లో అప్పు పుట్టే పరిస్థితి లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ముందుచూపు లేకుండా సంక్షేమం పేరుతో వేలాది కోట్ల పథకాలను ప్రకటిస్తున్నారని, అంత డబ్బు ఎక్కడి నుంచి ఎలా తెస్తారని నిలదీశారు.

‘పోలవరం రివర్స్‌ టెండరింగ్‌తో అనేక కంపెనీలు వెనక్కి మళ్లాయి. రాజధాని అమరావతిలో నిర్మాణాలు ఆగిపోయాయి. జగన్‌ ఇంకా ఎన్నికల మూడ్‌ నుంచి బయటపడనట్లుగా ఉంది. పరిశ్రమల్లో స్థానికులకు 75ు రిజర్వేషన్లు ఇవ్వాలన్న చట్టంతో పెట్టుబడిదారులంతా 200 కి.మీ. వేగంతో వెనక్కి పారిపోతున్నారు’ అని ఎద్దేవా చేశారు. 

‘కొత్త రాజధాని అమరావతి ఎలా మారుతుంది? సాక్షాత్తూ భారత ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చడం ఎవరి తరమూ కాదు’ అని సుజనా స్పష్టం చేశారు. ప్రభుత్వం అనేది నిరవధిక పరిపాలక సంస్థని, రాజకీయంగా ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ ఇలాంటివి మార్చడం కుదరదని చెప్పారు. దీనిపై బీజేపీ అధిష్ఠానంతో, ప్రధానితో చర్చిస్తానని తెలిపారు.