అయోధ్యను అడ్డుకోవడానికి శతవిధాలా కాంగ్రెస్ యత్నం

అయోధ్య కేసును సుప్రీంకోర్టులో అడ్డుకోవడానికి కాంగ్రెస్‌ శతవిధాల ప్రయత్నించిందని బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆరోపించారు. ‘అయోధ్య వివాదంపై తీర్పు కోసం చాలా ఏండ్లుగా ఎదురుచూశాం. రాజ్యాంగ నిబంధనలకు లోబడి పరిష్కారం లభిస్తుందని భావించాం. కానీ రాముడి ఆశీస్సులతో అనుకూలంగా తీర్పు వచ్చింది. రామాలయం నిర్మాణానికి మార్గం సుగమమైంది. బ్రహ్మండమైన రామ మందిరాన్ని నిర్మిస్తాం’ అని అమిత్‌ షా వెల్లడించారు.  

అయోధ్యలో రామాలయం నిర్మించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని, కానీ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఈ కేసును అడ్డుకోవడానికి ప్రయత్నించిందని ధ్వజమెత్తారు.  అయోధ్యలో రామాలయం రావడం కాంగ్రెస్‌కు సుతారామూ ఇష్టం లేదని స్పష్టం చేశారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం చిరకాలంగా బిజెపి రాజకీయ అజెండాగా ఉంటూ వచ్చిందని అమిత్ షా గుర్తు చేశారు.

త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అమిత్‌ షా జార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మానిక, లోహర్‌దాగా ప్రాంతాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ 70 ఏండ్లుగా రగులుతున్న కశ్మీర్‌ సమస్యను పరిష్కరించడంలో కాంగ్రెస్‌ పార్టీ విఫలమైందని దుయ్యబట్టారు. 

కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఆ పార్టీ సమస్యను పరిష్కరించలేదని చెబుతూ  మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రాగానే ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసింది. కశ్మీర్‌ అభివృద్ధికి బాటలు పరిచిందని తెలిపారు.

గత ప్రభుత్వాలు ఏళ్ల తరబడి నాన్చు తూ వస్తూ ఉన్న పలు కీలక జాతీయ సమస్యలపై ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తూ, ఒక్కోదానిని పరిష్కరిస్తున్నారని, ఇది ఆయన నాయకత్వ పటిమ అని కొనియాడారు. ముఖ్యమం త్రి రఘుబర్ దాస్‌కు రెండోసారి అధికారం కోసం బిజెపి అత్యున్నత స్థాయి ఎన్నికల ప్రచారానికి సంకల్పించింది.