బీజేపీ వైపు పలువురు కాంగ్రెస్ ఎమ్యెల్యేలు!

కర్ణాటకలో కాంగ్రెస్‌ నుంచి పలువురు ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య వెల్లడించారు. అటు దేశం ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్‌ లేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. జేడీఎస్‌, కాంగ్రెస్‌లలో ముఖ్యనేతల తీరుతోనే ఏకంగా 17మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసే పరిస్థితి వచ్చిందని గుర్తు చేశారు. 

ప్రస్తుతం రాష్ట్ర బీజేపీలో ఎటువంటి విభేధాలూ లేవని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి యడియూరప్ప, పార్టీ అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌ల నేతృత్వంలోనే ఉపసమరం సాగుతోందని తెలిపారు. 15 నియోజకవర్గాలలోను బీజేపీ గెలవనుందని ధీమా వ్యక్తం చేశారు. సిద్దరామయ్య మరోసారి సీఎం కావాలనుకునే భ్రమ వీగిపోయిందని ఎద్దేవా చేశారు.

కుమారస్వామి ముఖ్యమంత్రి పదవి కోల్పోయాక గందరగోళంలో ఉన్నారని చెబుతూ ఓ వైపు యడియూరప్ప ప్రభుత్వాన్ని కూల్చబోమని.. మరోవైపు 15 చోట్లా ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులను ఓడించడమే లక్ష్యమని కుమారస్వామి అంటుండడం అతని మానసిక పరిస్థితికి అద్దం పడుతోందని ధ్వజమెత్తారు. కుమారస్వామికి గెలిచే సత్తా కాని.. బీజేపీని ఓడించే శక్తి కానీ లేవని స్పష్టం చేశారు. 

మరోవంక,  శాసనసభ ఉప ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించే బాధ్యత ఇన్‌చార్జ్‌ మంత్రులదేనని సీఎం యడియూరప్ప స్పష్టం చేశారు. బుధవారం విధానసౌధలో  జరిగిన కేబినెట్‌ సమావేశంలో  కీలక అంశాలపై చర్చించిన తర్వాత సుదీర్ఘంగా ఉప ఎన్నికల విషయమై చర్చించినట్టు సమాచారం.